Red Meat: మాంసాహార ప్రియులకు వార్నింగ్.. అతిగా తింటే ఇక అంతే
Red Meat: మాంసాహార ప్రియులకు వార్నింగ్.. అతిగా తింటే ఇక అంతే
• ప్రపంచవ్యాప్తంగా మాంసం వాడకం చాలా ఎక్కువ...
• అతిగా తింటే అనారోగ్యమే అంటున్న పరిశోధకులు...
• గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని హెచ్చరిక...
• శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది...
• జీవిత కాలం తగ్గిపోతుందని పలు పరిశోధనలలో వెల్లడి...
ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వారికి చేదువార్త మరీ ముఖ్యంగా మాంసాహార ప్రియులకు.. మేక, గొర్రె, బీఫ్...(రెడ్ మీట్) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. రోజూ 28 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ (నిల్వ చేసిన మాంసం) తినేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 15 శాతం పెరుగుతోందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ స్టడీ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో దాదాపుగా 20 లక్షల మంది పెద్దవారిపై నిర్వహించిన 31 పైగా అధ్యయనాలను, వాటి ఫలితాలను నిశితంగా విశ్లేషించగా ఈ వివరాలు బయటపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. వలంటీర్ల రోజువారీ ఆహారపుటలవాట్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని దాదాపు పదేళ్లకు సంబంధించిన డాటాను విశ్లేషించినట్లు తెలిపారు. ఇందులో పొగతాగడం సహా ఇతరత్రా అలవాట్లు, బీఎంఐ, శారీరక శ్రమ, వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
లాన్సెట్ స్టడీలో ఏం తేలిందంటే...
రోజూ 28 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ (నిల్వ చేసిన మాంసం) తినేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 15 శాతం పెరుగుతోందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ స్టడీ తేల్చింది. రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తీసుకునేవారికి మధుమేహం ముప్పు 15 శాతం ఎక్కువని, రోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకుంటే ముప్పు 10 శాతం, రోజూ 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8 శాతం ఎక్కువని లాన్సెట్ స్టడీలో తేలింది. రెడ్ మీట్, ఇతర జంతువుల మాంసంలో ఎక్కువగా ఉండే హేమ్ ఐరన్ వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని హార్వర్డ్ టి.హెచ్.ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది.
ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుందని హెచ్చరిక...
రకరకాల ఆహార పదార్థాలుగా తయారుచేసుకుని తింటుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ లోనూ మాంసాహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా మాంసం వాడకం చాలా ఎక్కువ. అయితే, అతిగా తీసుకోవడం వల్ల మాంసాహారంతో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఎంత మాంసం తింటున్నారనే విషయంతో పాటు ఆ మాంసాహారం ఎలా వండారనేది కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు. మాంసాహారం వండే క్రమంలో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాలు, హై లెవల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇది టైప్ 2 మధుమేహానికి దారితీస్తుందని వివరించారు.