Banni Utsavam: దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటే ఏమిటి.. కర్రల సమరం ఎందుకు చేస్తారు? పూర్తి సమాచారం..
Banni Utsavam: దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటే ఏమిటి.. కర్రల సమరం ఎందుకు చేస్తారు? పూర్తి సమాచారం..
దసరా పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగట్టు వైపే ఉంటుంది. ఎందుకంటే బన్నీ ఉత్సవాల్లో కర్రల సమరం జరగడమే ఇందుకు కారణం. ఈ ఉత్సవంలో జరిగే హింసను అరికట్టాలని.. ఎంత ప్రయత్నించినా. అసలు బన్నీ ఉత్సవాల్లో ఎందుకు కొట్టుకుంటారో, ఏలా మొదలైందో తెలసుకోవాలంటే దేవరగట్టు వెళ్లాల్సిందే..
ఎనిమిది వందల అడుగుల ఎత్తైన కొండలో..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కర్రల సమరాన్ని అనాదిగా జరుపుకుంటున్నారు. హొలగుంద మండలం దేవరగట్టులో.. ఏటా దసరా రోజున నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు గ్రామం వద్ద.. కొండపై ఎనిమిది వందల అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేస్తారు. ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని కాగడాలు చేత బూని శివ, పార్వతుల కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవం ముగిశాక ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడంతో తలలు పగుల్తాయి. వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గ్రామస్తులు దీనిని ఓ క్రీడగా భావిస్తున్నా కర్రల సమరం మాత్రం భీకరంగా జరుగుతుంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు.
కర్రల సమరానికి ముందు వచ్చిన అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి ఈ బన్ని ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. 7 గ్రామాల ప్రజలు ఈ కట్టబాట్లు పాటిస్తారు. అయితే ఇతర గ్రామాల నుంచి కొంతమంది మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొంటుడడంతో హింసాత్మక ఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. వందల మంది తలలు పగులుతున్నాయి. అయినా సరే కర్రల సమరం వీడట్లేదు స్థానికులు.
ఎంతో చరిత్ర ఉన్న బన్నీ ఉత్సవం:
ఈ బన్నీ ఉత్సవంలో జరిగే దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది వస్తారు. మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరం ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది..
పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు:
బన్నీ ఉత్సవంలో హింసకు తావు లేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే గ్రామాల్లో రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు చేపట్టారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో 7 మంది డిఎస్పీలు, 42 మంది సిఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు, 362 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు , 3 పట్లూన్ల ఎఆర్ పోలీసులు , 95 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో పాల్గొంటారని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి చేస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. బన్ని ఉత్సవంలో మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు కావడం వంటి దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల నెరణికి,కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, గ్రామాలలో పోలీసు మరియు రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.