ఉల్లి,టమోటా ధరలను నియంత్రణ లో ఉంచాలి
ఉల్లి,టమోటా ధరలను నియంత్రణ లో ఉంచాలి
రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి. జి. భరత్
కర్నూలు, అక్టోబర్ 8 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో ఉల్లి, టమోటా ధరలను నియంత్రణ లో ఉంచాలని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి. జి. భరత్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ధరల నియంత్రణపై మంత్రి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తో కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్, ఆర్ డి ఓ లు, మార్కెటింగ్ శాఖ ఏడి, తహసిల్దార్లు, మార్కెట్ యార్డ్ ల సెక్రటరీలు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లు, పౌరసరఫరాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉల్లి, టమోటా ధరలు అసాధారణ రీతిలో పెరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా నియంత్రణలో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.. ముఖ్యమంత్రి కూడా ధరలను నియంత్రణలో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని గట్టిగా చెప్పారని మంత్రి పేర్కొన్నారు.. పండుగ సమయంలో కూరగాయల ధరలు అసాధారణ రీతిలో పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ధరలు పెరగకుండా ఉల్లి, టమోటా క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రైతు బజార్లు, మార్కెట్లు, మార్కెట్ యార్డులను సందర్శించి ధరలు నియంత్రణ లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.. ప్రతిరోజు జిల్లాలో ధరల వివరాలకు సంబంధించిన నివేదికను తనకు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు..
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఉల్లి, టమోటా ధరల నియంత్రణ కు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..ప్యాపిలి నుండి రోజూ 3 టన్నుల టమోటా ను తెప్పించడం జరుగుతోందని, రూ.40 నుండి రూ.45 ల లోపు టమోటా ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు..అలాగే ఉల్లి మార్కెట్ యార్డు లో తగినంత ఉందని, ఇతర జిల్లాలకు కూడా ఉల్లిని పంపడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు..ఉల్లి ధర కూడా రూ.36 లు ఉండేలా చర్యలను తీసుకుంటున్నామని, అలాగే వంట నూనెల ధరల నియంత్రణకు కూడా తగిన చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రైతు బజార్లు, మార్కెట్లు, మార్కెట్ యార్డులను విజిట్ చేయాలని, ఎక్కడైనా అసాధారణ రీతిలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అమ్మకాలు జరిపితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..రేపు సాయంత్రానికి ధరలను నియంత్రించాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులు,మార్కెట్ యార్డు సెక్రటరీ లు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లను ఆదేశించారు..
జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య మాట్లాడుతూ ఆయిల్ మిల్లర్లు, రిటైలర్లు, హోల్సేలర్ల తో సమా వేశం నిర్వహించి సంప్రదింపులు జరిపామని, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.126 లకు, పామ్ ఆయిల్ రూ.121 లకు అందిస్తామని అంగీకరించారని జేసీ తెలిపారు..
టెలి కాన్ఫరెన్స్ లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.