విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు, అక్టోబర్ 21 (పీపుల్స్ మోటివేషన్):- విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి తెలిపారు.
సోమవారం స్ధానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో పోలీసు అమరవీరులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , జిల్లా ఎస్పీ బిందు మాధవ్ , జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల ధైర్యసాహసాలు, దేశభక్తి మరియు విధేయతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని గౌరవిస్తారన్నారు. దేశ , రాష్ట్ర సరిహద్దు అంతర్గత భద్రత రక్షణలో పోలీసులు ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. దేశ భద్రత కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. పోలీసుల త్యాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుందన్నారు. దేశ , రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేస్తూ ముందుకు పోవడం గర్వకారణమన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ...
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ, నివాళులర్పిస్తూ ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ వద్ద విధులు నిర్వహిస్తూ ప్రాణాలను కోల్పోయారని, ఆ రోజు నుండి అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశ సరిహద్దుల్లోనే కాదు, అంతర్గతంగా ప్రతి రాష్ట్రంలో , జిల్లాలలో, గ్రామాలలో ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అన్ని వ్యవస్థల కంటే పోలీసు వ్యవస్థలో పని చేయడం చాలా కష్టతరమని, 24 గంటలు పని చేయాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఫైర్, ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు వెంటనే స్పందించేది పోలీసులేనన్నారు. ప్రజల, ధన, మాన , ప్రాణాలను కాపాడడంలో ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులు ముందుకు వెళతారని, అటువంటి పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవడం, అమరులకు నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అన్నారు. ప్రజలకు అండగా ఉంటూ, భద్రత కల్పించడానికి మేము ఉన్నామనే భరోసా పోలీసుల ద్వారా ఏర్పడుతుందన్నారు. పోలీసుల త్యాగ నిరతిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలసిన భాధ్యత మన అందరి పై ఉందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి సమస్యలున్నా, సహాయం కావాలన్నా అండగా ఉంటామన్నారు.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ...
1959 సంవత్సరం అక్టోబరు 21 వ తేదీన భారత్ - చైనా సరిహద్దు లఢఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పోలీసు పెట్రోలింగ్ పహారాలో ఉన్నటువంటి 10 మంది సిఆర్పిఎఫ్ జవానుల పై శత్రువులు దాడి చేయగా, ధైర్యసాహసాలతో వారి పై ప్రతి దాడి చేస్తూ పోరాడి వీరమరణం పొందారన్నారు. స్వాతంత్ర్యం తరువాత దేశభద్రత కోసం పోలీసులు ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన అన్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తించి , గౌరవించి, దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సంను అక్టోబర్ 21వ తేదిన జరుపుకుంటూ అమరవీరులకు శ్రధ్దాంజలి నిర్వహిస్తున్నామన్నారు. ఒకరి కోసం చేసే త్యాగం ఉన్నతమైనదైతే ప్రజారక్షణ కోసం చేసే త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ , రాష్ట్ర భద్రత కు పోలీసులు పగలనక, రాత్రి అనక విధి నిర్వహణలో ప్రజల శ్రేయస్సుకై ప్రాణాత్యాగం చేస్తున్నారన్నారు. అమరవీరులను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుంటూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించడం మరియు వారి కష్టాలకు అండగా నిలబడుతున్నామన్నారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 216 మంది పోలీసులకు శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ శాలువతో సన్మానించి సత్కరించారు.
కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం. మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, శ్రీనివాస రావు, పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు,పోలీసు అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.