-Advertisement-

వన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications
Peoples Motivation

వన్య ప్రాణుల రక్షణ మనిషి  బాధ్యత

• వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది

• పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే  

• మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ 

• పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి

• మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   

వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవ రాశుల కంటే మనం ఉన్నత దశలో ఉన్నాం. మనపై ఆధారపడిన, మనతోపాటు జీవనం సాగించే ఇతర జీవ రాశులన్నింటినీ రక్షించుకుంటేనే మనిషి సాగిస్తున్న ఈ దశ స్వచ్ఛంగా సాగిపోతుంది. ఈ మాటలనే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి' అని ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications

వన్య ప్రాణులు, సముద్ర జీవులు, ఇతర జీవరాశి పూర్తి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి, నీరు అందుతుంది. ఇతర జీవుల మనుగడ మీద మన ఉనికి ఆధారపడి ఉందనే విషయం నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. పర్యావరణ, వన్య ప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “వన్య ప్రాణుల రక్షణ అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. నల్లమల చెంచులు తమ జీవన విధానంలో వణ్యప్రాణులను దేవుళ్లుగా భావిస్తారు. పెద్దపులిని పెద్దమ్మ దేవుడుగా, ఎలుగు బంటిని లింగమయ్యగా, అడవిపందిని బంగారు మైసమ్మగా, రేసుకుక్కను బవరమ్మగా కొలుస్తారు. మన వేదాలు, పురాణాల్లో సైతం మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారానికి విశిష్టత ఉంది. 

మనతో పాటు వన్య ప్రాణుల రక్షణ, వాటికి ఇవ్వాల్సిన విలువ గురించి పురాణగాధలు చెప్పే గొప్ప విషయాలు ఇవే.

సముద్ర జీవుల్ని రక్షించడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పని చేయడం నాకు ఆనందం కలిగించింది. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం వారు పని చేస్తున్న తీరు ప్రశంసనీయం. వీరిలో మత్స్యకారులు ఉన్నారు. ఒకప్పుడు వలలో తాబేళ్లుపడితే, వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేవారు. అలాంటి వారు ఇప్పుడు తాబేళ్లు వలలో చిక్కితే, వల కోసి మరీ వాటిని మళ్లీ సముద్రంలోకి వదిలేస్తున్నారు. వేటాడే మత్స్యకారులే ఇప్పుడు రక్షకులయ్యారు. 

కొన్ని అవసరాలరీత్యా మనిషి సముద్ర జీవులను వేటాడుతున్నాడు. విశిష్టమైన జాతులను మెడిసిన్ కోసమో, ఇతర అవసరాల కోసమంటూ సేకరిస్తున్నాం. అయితే సేకరించే మనిషే వాటి జాతిని పెంచేందుకు కూడా ఆలోచన చేయాలి. లేకుంటే భవిష్యత్తు తరాలకు ఈ విశిష్టమైన, అరుదైన సంపదను ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయి.

పర్యావరణ పరిరక్షణ అవసరం తెలియచెప్పండి

భవిష్యత్తు తరాలకు బంగారం లాంటి పర్యావరణాన్ని అందించాలంటే చిన్నప్పటి నుంచే వారికి ప్రకృతి ప్రాధాన్యం, పర్యావరణ అవసరాలను తెలియ చెప్పాలి. 

చిన్నప్పుడు రాత్రివేళ చెట్ల మీద చేయి వేయకండి అని పెద్దలు చెబితే ఎందుకు వేయకూడదు..? చెట్లు నిద్రపోతాయా అని వితండ వాదన, పిడివాదన చేసేవాళ్లం. కానీ చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ గారి వంటి మహానీయులు చెప్పారు. 

పర్యావరణ మూలధనం చెట్లు. వాటిని రక్షించుకొని భావి తరాలకు అద్భుతమైన పర్యావరణం, పచ్చదనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పర్యావరణాన్ని కాపాడాలంటే మన వంతుగా రోజువారీ వాడుతున్న ప్లాస్టిక్ కు క్రమంగా తగ్గించాలి. మొక్కల పెంపకం అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. 

పిల్లలు చెప్పిన విషయాలు నన్ను కదిలిస్తాయి. కల్మషం లేకుండా మనసులో ఏముంటే అది వారు చెబుతారు. వారి సూచనలు నేను అందుకే వింటాను. ఇక్కడకు వచ్చిన విద్యార్థుల స్ఫూర్తి నాకు కొత్త ఉత్సాహం అందించింది. నా చిన్నపుడు ఎక్కడైనా పంపులో నీరు సులభంగా తాగే వాళ్లం. ఇప్పుడు ఏం తాగాలన్నా భయంగా ఉంది. నా చిన్నపుడు భవిష్యత్తులో నీరు, గాలి కొనుక్కోవాలని అని చెబితే నవ్వుకునేవాళ్లం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. దీనికి మనమే కారణం. 

భావి తరాలకు ఎలాంటి ప్రకృతిని బహుమతిగా అందిస్తాము అనేది మన చేతిలో ఉంది. దానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు పర్యావరణ హితం కోసం ఆలోచించి ప్రతి పని చేయాలి. పర్యావరణాన్ని రక్షించడం అనేది రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. 

ఆకట్టుకున్న ఎగ్జిబిషన్

పర్యావరణ, వన్య ప్రాణి సంరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమనే విషయాన్ని తెలియజేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించి ప్రతి గ్యాలరీని తిలకించారు. వన్య ప్రాణుల సంరక్షణ, చేపడుతున్న చర్యలపై అధికారులతో చర్చించారు. 

వన్యప్రాణుల విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఉన్న సముద్ర తాబేళ్ల బొమ్మలను ఆయన ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. సముద్ర జీవ సాక్ష్యం అనే ప్రత్యేక యాప్ ను ప్రారంభించారు.  

విద్యార్థుల ఉత్సాహం

అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరిగిన వన్య ప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళగిరి ప్రాంతం పరిధిలోని స్కూళ్లలో అనేక పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికైన విద్యార్థులకు పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. 

చిన్నప్పటినుంచే విద్యార్థులకు ప్రకృతి, వన్య ప్రాణుల సంరక్షణ గురించి తెలియజేయాలని, అది భవిష్యత్తు తరాలకు  అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. కాసేపు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అటవీ సంరక్షణపై చిన్నారులు వేసిన పెయింటింగ్ ఎంతో ఆకట్టుకుందని, అటవీ సంరక్షణ ప్రాముఖ్యతకు ఇది అద్దం పట్టిందని మెచ్చుకున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకి వారి శైలిలో పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేయడంతో విద్యార్థుల్లో ఉత్సాహం పొంగి పొరలింది.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ పీసీసీఎఫ్, హెచ్ ఓ ఎఫ్ ఎఫ్ చిరంజీవి చౌదరి, సీనియర్ అధికారులు ఎ.కె.నాయక్, ఆర్ పి ఖజురియా, డా.శ్రీధర్, రేవతి, రాహుల్ పాండే, శాంతి ప్రియ పాండే తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-