నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
• మంత్రి టి.జి.భరత్, మేయర్ బి.వై. రామయ్య
• స్థానిక సమస్యలపై వాడివేడిగా చర్చ
• ఆక్రమణల తొలగింపు, తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ
• విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం
• 6 తీర్మానాలు, రూ.1.85 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదముద్ర
కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యం శాఖల మంత్రి టి.జి. భరత్, నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ కాలనీలోని కౌన్సిల్ హాలులో మేయర్ అధ్యక్షతన నగరపాలక పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి, కమిషనర్ ఎస్.రవీంద్రబాబు హాజరయ్యారు.
ముందుగా ఇటివల చివరి శ్వాస విడిచిన ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మంత్రి హోదాలో తొలిసారి పాలకవర్గ వచ్చిన సర్వసభ్య సమావేశానికి వచ్చిన టి.జి. భరత్‌ను మేయర్, కమిషనర్ సత్కరించారు. అనంతరం ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన అధికారులు తమను సభకు పరిచయం చేసుకున్నారు.
తాగునీటి సమస్య, ఆక్రమణలులకు సంబంధించి వాడివిడిగా చర్చ జరిపారు. విద్యుత్తు శాఖకు సంబంధించి కొత్త స్థంభాలు, ప్రదేశాలు మార్పులు, మరమ్మతులకు సంబంధించి సంబంధిత అధికారులపై పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పలువులు కార్పొరేటర్లు తమ వార్డులలో స్థానిక సమస్యలను లేవనెత్తారు. పలుపనుల్లో అవకతవకలు జరిగినట్లు కార్పొరేటర్లు లేవనెత్తారు. తాము తెలిపిన సమస్యలను మినిట్స్ రాసుకుని, పురోగతి తెలపాలని పలువురు కార్పొరేటర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మూడు నదులు ఉన్న నగరానికి నీళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. వీలైనంతవరకు ప్రజలకు పగటిపూటే నీళ్ళు అందించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కార్పొరేటర్లు తెలిపిన సమస్యలను, అధికారులు తప్పనిసరిగా మినిట్స్ బుక్ రాసుకోవాలని సూచించారు. పేద ప్రజలకు కమ్యూనిటీ భవనాలు ఎంతో అవసరమని, నగరంలో పలుచోట్ల కమ్యూనిటీ భవనాల్లో ఉన్న సచివాలయాలను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రహదారుల విస్తరణ త్వరగా చేపట్టాలని ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు లేఖ సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని, అత్యవసరమైన రహదారులు, మురుగు నిర్మాణ పనులకు, అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాల కోరిక స్మార్ట్ సిటీ సాకారం చేసేందుకు సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని, మంత్రి టి.జి. భరత్ సారథ్యంలో అది నెరవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులతో పాటు, నూతన ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నగరాన్ని మరింతగా తీర్చిదిద్దుతామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అవకతవకలు, అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ కల్లూరు ప్రాంతంలో పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. నీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, కల్లూరు ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉన్నందున త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గానికి సంబంధించి మూడు వార్డులలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్మార్ట్ సిటీ ఎంపికకు సంబంధించి ప్రభుత్వం పలు వివరాలను అడుగుతుందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. సాధ్యమైనంతవరకు పగటిపూటే తాగునీటి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వార్డులలో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నగరపాలకకు సంబంధించి జరిగిన పనుల్లో ఏవైనా అవకతవకలు జరిగింటే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ రాజశేఖర్, ఆర్ఓలు జునైద్, ఇజ్రాయిల్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ ఈఈ చంద్రమోహన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాలు ఇవే:
1. ఖాళీలు ఏర్పడిన రెండు పర్యవేక్షకులు (సూపరింటెండెంట్) పోస్టులలో అర్హులైన ఎగువశ్రేణి సహాయకులు టి.అబ్దుల్ వాజీద్, కె.రామక్రిష్ణలకు పదోన్నతి కల్పించి ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
2. పారిశుద్ధ్య విభాగంలో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన 5 పోస్టులలో అర్హులైన వారిని నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
3. 13వ వార్డులో కెసి కెనాల్ వెంబడి ఆక్రమణలు తొలగించి, కెనాల్ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించుట, ఫిషరీస్ కార్యాలయం నుండి బంగారుపేట పబ్లిక్ టాయిలెట్స్ వరకు రోడ్డు రహదారి నిర్మాణానికి రూ.60 లక్షలు కేటాయించారు.
4. అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రం నందు నీటి శుద్ధికి సంబంధించి అవసరమైన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ-క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్, ఫెరిక్ అలమ్ సరఫరా కొరకు రూ.1.25 కోట్లు కేటాయించారు.
5. కర్నూలు - గుంటూరు రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరణ పనులకు సంబంధించి దామోదరం సంజీవయ్య కూడలి నుండి సాయి గార్డెన్ కాంపౌండ్ వాల్ వరకు భూసేకరణకు మంజూరైన రూ.1 కోటి రూపాయల కన్నా దాదాపు రూ.67 లక్షల పరిహారము అధికంగా చెల్లించాల్సి వస్తున్నందున, 120 అడుగుల రహదారిని 100 అడుగుల రహదారిగా మాస్టర్ ప్లాన్ నందు సవరించి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుటకు ఆమోదించారు.