Crime News: ఇంటర్ విద్యార్థినిపై హత్యాయత్నం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు
Crime News: ఇంటర్ విద్యార్థినిపై హత్యాయత్నం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు
- వైఎస్సార్ జిల్లాలో ఘటన
- మాట్లాడాలి రమ్మంటూ పిలిచి దారుణానికి పాల్పడిన యువకుడు
- 80 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల్లో అమ్మాయి
- హత్యాయత్నంపై సీఎం ఆరా
- నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలన్న సీఎం చంద్రబాబు
- నిందితుడి కోసం 4 పోలీసు బృందాలతో గాలింపు
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు సమీపంలో చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై విగ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు మహిళలు గుర్తించి విద్యార్థినిని రక్షించి పోలీసులకు సమాచారం అందిచారు. అమ్మాయిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కడప రిమ్స్ తరలించారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేయండి..
కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గోపవరం మండలంలో ఘటన.... కడప రిమ్స్ కు విద్యార్థినిని తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని సిఎం ఆదేశం ఘటనా స్థలికి వెళ్లిన జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు
అప్పటి నుంచే వేదింపులు...
అదే కాలనీకి చెందిన విగ్నేష్ అనే వ్యక్తితో బాలికకు గతంలోనే పరిచయం ఉంది. బాధితురాలైన మైనర్ బాలిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే వివాహం చేసుకున్న విగ్నేష్ ఇవాళ కళాశాల నుంచి బాలికను ఆటోలో తీసుకెళ్లాడు. ముళ్లపొదల్లోకి వెళ్లిన తర్వాత బాలిక ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేకలు వేస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న కొందరు మహిళలు గుర్తించి బాలికను కాపాడారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను విఘ్నేష్ వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. 8వ తరగతి నుంచే విఘ్నేష్ వేధిచేవాడని అతనికి వివాహమైనా తమ కుమార్తె వెంట పడేవాడని బాలిక తల్లిదండ్రులు అన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈ ఘటనపై బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయని అన్నారు. విద్యార్థినికి కడప రిమ్స్‌లో చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వారేనని ఎస్పీ వివరించారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేష్ ఫోన్ చేశాడని, కలవకపోతే చనిపోతానని బెదిరించాడని అన్నారు. ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లాక విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేష్ పరారయ్యాడని అన్నారు. నిందితుడి ఆచూకీ కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు.