MGNREGS: ఉపాధి హామీ పథకంలో 84.8 లక్షల మంది కార్మికుల తొలగింపు
MGNREGS: ఉపాధి హామీ పథకంలో 84.8 లక్షల మంది కార్మికుల తొలగింపు
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 84.8 లక్షల మంది కార్మికులను కేంద్రప్రభుత్వం తొలగించిందని లిబ్ టెక్ అనే సంస్థ పేర్కొంది.
ఎక్కువ మందిని తొలగించిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, అస్సాం, బీహార్ లు ఉన్నాయి.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 8 కోట్ల మంది కార్మికులను తొలగించినట్టు లిబెక్ పేర్కొన్నది.
దేశంలో ఉపాధి హామీ అమలుపై విద్యావేత్తలు, కార్యకర్తలతో కూడిన లిబెక్ నివేదిక ప్రకారం, ఉపాధి హామీ పథకంలో వ్యక్తిగత పని దినాలు తగ్గుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 16.6 శాతం వ్యక్తిగత పని దినాలు(ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఒక కార్మికుడు పని చేసే రోజులు) తగ్గనున్నట్టు తెలిపింది. కాగా, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్)ను తప్పనిసరి చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారిందని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 154 కోట్ల వ్యక్తిగత పనిదినాలు గణనీయంగా పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 184 కోట్ల వ్యక్తిగత పని దినాలు నమోదయ్యాయి.
2023-24లో సంబంధిత కాలవ్యవధితో పోలిస్తే 2024-25 ఏప్రిల్-సెప్టెంబర్ లో ఆరు రాష్ట్రాల్లో పనిదినాలు వృద్ధి చెందగా, 14 రాష్ట్రాలు వ్యక్తిగత పని దినాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఎబిపిఎస్)ను తప్పనిసరి చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. ఇందుకోసం కార్మికుల జాబ్ కార్డుకు ఆధార్ లింక్ అవ్వాలి. ఆధార్, జాబ్ కార్డుపై పేరు సరిగ్గా పొంతన కుదరాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కావడంతో పాటు, ఎన్పీసీఐలో నమోదు కావాలి. వీటిల్లో ఏది లేకపోయినా కార్మికులు ఏబీపీఎస్కు అనర్హులుగా మారుతున్నారని, మొత్తం కార్మికుల్లో 27.4 శాతం మంది అనర్హులుగా ఉన్నట్టు లిబెక్ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం/జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను 2005, ఆగస్టు 25న చట్టంగా రూపొందించి అమలు చేస్తుంది. దీన్ని 2006, ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా 200 జిల్లాలో ప్రారంభించారు. 2008లో దీన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పుచేశారు.
ముఖ్యోద్దేశం: ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో కోరిన వారికి స్థానికంగానే 100 రోజుల పని కల్పించడం.
ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీలు అమలు చేస్తాయి.
లక్ష్యం: ఈ పథకం కింద గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, కాలువలు, చెరువులు, బావులు, సంప్రదాయక నీటి వనరుల పునరుద్దరణ, కరువు నివారణ చర్యలు, అడవుల పెంప కం, వరదల నియంత్రణ, రక్షణ పనులు చేపట్టడడం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల భూముల్లో వ్యవయాభివృద్ధికి అనువైన పనులు చేపట్టి సాగులోకి తీసుకురావడం.
గ్రామీణ కూలీల వలసలను తగ్గించడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించే దిశగా ధనిక, పేద వృత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేయడం.