SSC: పదవ తరగతిలో ప్రతి విద్యార్థి పాస్ కావాలి
SSC: పదవ తరగతిలో ప్రతి విద్యార్థి పాస్ కావాలి
ఉత్తమ ఉపాధ్యాయుల తో పదవ తరగతి విద్యార్థులకు వర్చువల్ బోధనకు తగిన ఏర్పాట్లను చేయండి
-జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):- జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి, విద్యార్థులతో సంభాషించారు.. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధన, పిల్లల సామర్థ్యం, ఉత్తీర్ణత తదితర అంశాల గురించి కలెక్టర్ చర్చించారు.
జిల్లా కలెక్టర్ ముందుగా పాఠశాల ఆవరణంలోని బాల బాలికలతో సంభాషిస్తూ, భోజనం చేశారా ? మెనూ ప్రకారం మీకు భోజనం అందజేస్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు..మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నారని పిల్లలు సమాధానమిచ్చారు.. పాఠశాలలో లైబ్రరీ ఉందా అని కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.. పాఠశాలకు వచ్చే పిల్లల హాజరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఒకవేళ వారు పాఠశాలకు హాజరు కాకపోతే ఎందుకు రాలేదు అనే కారణాలను అడిగి తెలుసుకుంటున్నారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈ సంవత్సరం నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఏ సబ్జెక్టు లో ఎంత మంది పాస్ అయ్యారని టీచర్స్ ను అడిగి తెలుసుకున్నారు..ప్రస్తుతం పదవ తరగతి చదివే విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన వారు కూడా పాస్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు..
జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయుల తో పాఠ్యాంశాలు బోధించేందుకు వర్చువల్ పద్ధతిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డిఈఓను ఆదేశించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, బాగా బోధించే ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ అయ్యేలా బోధన ఉండాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సూచించారు..ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు చదవడం,రాయడం వంటి కనీస నైపుణ్యాలు సాధించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
సమావేశంలో ఉపాధ్యాయులు, మున్సిపల్ కమీషనర్ ఎస్.రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఈఓ శామ్యూల్, కర్నూల్ అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.