Wine Shop Tenders: ఆ దుకాణాలకు వచ్చింది ఒక్క దరఖాస్తే.. మద్యం దుకాణాల దరఖాస్తుకు నేడే చివరి రోజు
Wine Shop Tenders: ఆ దుకాణాలకు వచ్చింది ఒక్క దరఖాస్తే.. మద్యం దుకాణాల దరఖాస్తుకు నేడే చివరి రోజు
16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఈ ఒక్కరోజే అవకాశం ఉంది. గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు అందాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 7,920 దరఖాస్తులు రాగా, నాన్ రిఫండబుల్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి 8 గంటల వరకూ మద్యం దుకాణాల కోసం 65,629 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు (అక్టోబర్ 11) కావటంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 12 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే రాగా 46 దుకాణాలకు రెండు, 57 దుకాణాలకు మూడు, 79చోట్ల నాలుగు, 115 దుకాణాలకు ఐదు చొప్పున దరఖాస్తులు మాత్రమే రావటం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ భాగం 21 దుకాణాలు తాడిపత్రి నియోజకవర్గంలోనివే కావడం గమనార్హం. ఇక తిరుపతి జిల్లాలో 12 దుకాణాలకు రెండేసి టెండర్లు మాత్రమే పడగా వాటిలో 4 చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని ఎక్కువ దుకాణాలకు 3 నుంచి 4 లోపే టెండర్లు వచ్చాయి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని 56 నుంచి 61వ నంబరు వరకూ మద్యం దుకాణాలకు మూడు చొప్పున దరఖాస్తులు అందాయి.
ఆయా జిల్లాల్లో ఇలా..
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలోని 100, 101, 102 నంబరు దుకాణాలకు ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు, పెండ్లిమర్రి, కమలాపురం గ్రామీణ మండలాల్లోని మద్యం దుకాణాలకు రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోని అనేక మద్యం దుకాణాలకు నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
రాప్తాడు నియోజకవర్గంలోని సీకేపల్లి, కనగానపల్లి మండలాల్లోని మద్యం దుకాణాలకు ముగ్గురు, హిందుపూరం మున్సిపాలిటీలోని పలు దుకాణాలకు ముగ్గురు చొప్పున దరఖాస్తు చేశారు.
ఆ దుకాణాలకు వచ్చింది ఒక్క దరఖాస్తే..
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని 8, 9 నంబర్ల దుకాణాలకు కేవలం ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 80, 81 దుకాణాలు, అమరాపురంలోని 84వ దుకాణానికి ఒక్కో టెండర్ మాత్రమే వచ్చింది. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 26, 28 నంబరు దుకాణాల, అనంతపురం జిల్లా పామిడిలోని 66, పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని 98వ నంబరు దుకాణాలకు ఒకటికి మించి టెండర్ పడలేదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏకంగా నాలుగు (175, 182, 183, 187) దుకాణాలకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం.