విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
విజన్ 2047ను సాకారం చేయడంలో టీచర్ల పాత్ర కీలకం..
గత ప్రభుత్వం టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టినప్పుడు చాలా బాధపడ్డాను..
ప్రతి టీచర్ విజ్ఞాన గనిగా మారాలి..
మీ గౌరవాన్ని, ప్రతిష్టతను నిలబెట్టే బాధ్యత మాది..
విజ్ఞాన కేంద్రాలుగా విశాఖ, అమరావతి, తిరుపతిని మారుస్తాం..
రాబోయే 5 ఏళ్లలో నాలెడ్జ్ ఎకానమీకి హబ్ గా ఏపీ తయారవ్వాలి..
నేనూ నిత్య విద్యార్ధిని....రిక్షా కార్మికుడు మంచి సలహా ఇచ్చినా అమలు చేస్తా..
పాపులేషన్ మేనేజ్మెంట్ పై చర్చ జరగాల్సిన సమయం ఇది..
ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అద్యాపక, ఉపాధ్యాయులకు సన్మానం
అమరావతి: ‘తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు.....కానీ విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది టీచర్లతోనే. ఇంట్లో ఉండే సమయం కంటే...స్కూళ్లలో ఉండే సమయమే ఎక్కువ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అందరం తల్లిదండ్రులను గుర్తు పెట్టుకుంటాం..కానీ గురువులను మర్చిపోలేం. నాకు చిన్నతనంలో చదువు చెప్పిన గురువులు. నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో జాతీయ విద్యా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉత్తమ అద్యాపక, ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉన్నత విద్యలో విద్యారంగలో పెనుమార్పులు
‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1951లో ఐఐటీని స్థాపించారు. మన దేశంలో నేడు విద్యార్థులు ఐఐటీ చదువుకుని నాడు ప్రపంచం మొత్తం వెళ్లగలిగారంటే దానికి కారణం ఆజాద్. 1953లోనే యూజీసీ తీసుకొచ్చారు. ఐఐటీ, యూనివర్సిటీ విద్య వ్యాప్తితో పాటు పెనుమార్పులు తీసుకొచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ...రేణిగుంటలో టీచర్ గా పని చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణస్ దేశానికి రాష్ట్రపతి కూడా అయ్యారంటే అది టీచర్లకు ఉన్న శక్తి, సామర్ధ్యం. సెప్టెంబర్ 5న జరగాల్సిన టీచర్స్ డే వరదల వల్ల నిర్వహించలేకపోయాం. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చాయి...బాధితులకు మొక్కుబడిగా సాయం చేయలేదు. రేయింబవళ్లు పని చేసి ప్రజలను సాధారణ స్థితికి 10 రోజుల్లోనే తీసుకొచ్చాం. భారతదేశం చాలా గొప్ప దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు మారుపేరు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. వాటి ద్వారా దేశం దశదిశ మారిపోయింది. ఆ సంస్కరణలు తెచ్చిన పీవీ.నరసింహరావు మన తెలుగువాడు కావడం అదృష్టం. 1995లో ఇంటర్నెట్ విప్లవం రావడంతో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం...హైటెక్ సిటీ నిర్మించి ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలను ఆహ్వానించాం. ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటును ప్రోత్సహించాం. అప్పటికి 25 ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు పదేళ్లలో 300 అయ్యాయి. మీరు చదవులు చెప్పిన వారు అమెరికాలో ఉంటూ డాలర్లు సంపాదిస్తున్నారు. ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఒక కొత్త సంస్కృతికి తీసుకొచ్చారు. భాష మర్చిపోతే జాతి కనుమరుగువుతుంది. డబ్బులు సంపాదించడానికి ఇంగ్లీష్ కావాలి...జాతిని నిలుపుకోవడానికి మాతృభాషను కాపాడుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్ ను బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్లాలి.’ అని ముఖ్యమంత్రి సూచించారు.
సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి టీచర్లకు ఉంది
‘ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేస్తున్నాం. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్-1 లేదా నెంబర్-2 స్థానంలో ఉంటుంది. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ తయారవుతుంది.
ఒకప్పుడు జనాభా నియంత్రణకు పని చేశాం. కానీ ఇప్పుడు జనాభా పెంచాలని చూస్తున్నాం. దానికి కారణం భవిష్యత్తులో యువత తగ్గుతుంది. స్థానిక సంస్థల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులన్న నిబంధనను రద్దు చేశాం. కొన్ని సమయాల్లో సరిగా ఆలోచించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి టీచర్లకు ఉంది...అది ఇప్పటి నుండే మీరు కొనసాగిస్తే మన దేశాన్ని అభివృద్ధిలో ఎవరూ అడ్డుకోలేరు. బ్రిటిషు వారు వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లి మనకు ఇంగ్లీష్ భాషను ఇచ్చి పోయారు. జనాభా మేనేజ్మెంట్ చేసుకుంటే 100 దేశాల్లో పబ్లిక్ గవర్నెన్స్ లో మనమే ముందుంటాం.
విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం
‘విద్యా వ్యవస్థలో చాలా సంస్కరణలు చేపట్టాం. గతంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువ ఉండేవి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ స్కూళ్లు, కాలేజీలు ఉండేవి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లు ఉండేవి కాదు. దీంతో అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క కి.మీ ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కి.మీ ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కి.మీలకు ఒక హైస్కూల్ ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ విధానాన్ని 1995లో తీసుకొచ్చాం. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 11 డీఎస్సీలు ఏర్పాటు చేసి 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. నేను 8 డీఎస్సీలు నిర్వహిస్తే, ఎన్టీఆర్ 3 నిర్వహించారు. ఇప్పుడు మరో డీఎస్సీ రాబోతోంది. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం డీఎస్సీపైనే పెట్టాను. విద్యా ప్రమాణాలు పెంచాలని 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపాం. గతంలో 33 శాతం మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. ఈ విధానంలో కొందరు నన్ను వ్యతిరేకించారు. రిజర్వేషన్లు క్రాస్ అయినా పర్వాలేదని చెప్పాను. 5 వేల డిజిటల్ క్లాసులు, వర్చువల్ క్లాసులు ఏర్పాటు చేశాం. చదువుల్లో విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ప్రతిభా అవార్డులు కూడా తీసుకొచ్చాం. మెరిట్ ను ప్రమోట్ చేశాం...తద్వారా ప్రభుత్వమే చదివించే విధానాన్ని ప్రవేశపెట్టాం.’ అని సీఎం అన్నారు.
విజ్ఞాన కేంద్రాలుగా విశాఖ, అమరావతి, తిరుపతిని మార్చుతాం
‘ఒకప్పుడు టీచర్ ను ఎడాపెడా జిల్లా పరిషత్ ఛైర్మన్ బదిలీ చేసేవారు. రాజకీయ నాయకులు వెళ్లి అడిగితే వెంటనే బదిలీలు చేసేవారు. టీచర్లను ఇష్టం వచ్చినట్లు ఫుట్ బాల్ మాదిరి ఆడుకున్నారు. కానీ టీచర్లను గౌరవించే విధానంలో భాగంగా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి పని తనాన్ని బట్టి కోరుకున్న స్థానానికి బదిలీలు చేయించాం. నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాలన్న ఉద్దేశ్యంతో ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటీ కర్నూల్, సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, మంగళగిరికి ఎయిమ్స్ తెచ్చాం. మన పిల్లలు బెస్ట్ యూనివర్సిటీల్లో చదవాలని ఆకాంక్షించాం. అమరావతికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ యూనివర్సిటీలు తెచ్చాం..త్వరలో ఎక్స్ఎల్ ఆర్ ఐ కూడా వస్తుంది. విశాఖ, అమరావతి, తిరుపతిని విజ్ణాన కేంద్రాలుగా మార్చే బాధ్యత తీసుకుంటాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన బాత్రూములు ఫోటోలు తీసే విధానాన్ని కూడా రద్దు చేశాం. మిమ్మల్ని అవమానపరిచారు. బ్రాందీ షాపుల వద్ద మందుబాబులను నియంత్రించేందుకు మిమ్మల్ని కాపలా పెట్టినప్పుడు చాలా బాధపడ్డాను. మీ బాధను అర్ధం చేసుకున్నాను. పిల్లలు భవిష్యత్ తీర్చిదిద్దేవారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.’ అని తెలిపారు.
రిక్షా కార్మికుడు సలహా ఇచ్చినా అమలు చేస్తా
‘గత ప్రభుత్వం రూ.10.90 లక్షల కోట్లు అప్పులు చేసింది. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యా..ఇంతటి ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. గతంలో ఎవరూ వ్యవస్థలను విచ్చిన్నం చేయలేదు. కానీ ఇప్పుడు వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి ఘోరంగా దెబ్బతీశారు. అయినా ఆ ఇబ్బందులను చూసి భయపడటం లేదు. ప్రజలు గెలవాలి...రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని ఇచ్చిన పిలుపుతో 93 శాతం సీట్లు గెలిపించారు. నాలెడ్జ్ ఎకానామీకే భవిష్యత్ ఉంటుంది. హార్డ్ వర్క్ కాదు...స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోవాలి. మీ స్కిల్స్ కూడా పెంచుకుని విద్యార్ధుల స్కిల్స్ పెంచాలి. అపార్ ఉంది...పిల్లల డేటా అప్ డేట్ చేస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత ఎలాంటి రిసోర్స్ కావాలో ఇప్పుడే ప్లాన్ వేసి కరికులమ్ మార్చుకునే అవకాశం తీసుకొస్తాం. యూనివర్సిటీల్లో ప్రమాణాలు పడిపోయాయి. లెర్నింగ్, డీ లెర్నింగ్ అనేది జీవితంలో చాలా ముఖ్యం. బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరూ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. నేను కూడా నిత్య విద్యార్ధినే....వెళ్లేదారిలో రిక్షా కార్మికుడు మంచి మాట సలహా ఇచ్చినా అమలు చేస్తాను. ప్రజాసేవలో ఉన్నప్పుడు ఎవరు మంచి చెప్పినా తీసుకుంటాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మనదేశంలోని కుటుంబ వ్యవస్థ పవర్ ఫుల్..మరే దేశంలోనూ ఇటువంటి వ్యవస్థ లేదు. పిల్లలకు కుటుంబ వ్యవస్థ విలువలను నేర్పిస్తుంది. ఒక్క హిందూ కటుంబం అనడం లేదు....ఇండియా కుటుంబాలు అంటున్నా. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా...మన దేశంలోని కుటుంబ వ్యవస్థకు...పక్క దేశాల్లోని కుటుంబ వ్యవస్థకు చాలా తేడా ఉంది.’ అని వ్యాఖ్యానించారు.
ప్రతి టీచర్ విజ్ఞాన గనిగా మారాలి
‘కొందరిలో విలువలు పూర్తిగా పడిపోతున్నాయి. సోషల్ మీడియా చూస్తే భయమేస్తోంది. లెక్కలేని తనంతో ప్రవర్తిస్తున్నారు. విలువలు కాపాడే ఆలోచన రావడంతోనే స్టూడెంట్స్ ఎథిక్స్, వ్యాల్యూస్ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమించాం. విలువలు లేకుంటే ఎవరైనా పతనానికి వెళతారు. సమాజహితం, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మంచిని ప్రోత్సహించి విలువల కాపాడుకుంటే అవే రక్షణగా నిలుస్తాయి. రాబోయే 5 ఏళ్లలో నాలెడ్జ్ ఎకానమీకి హబ్ గా ఏపీ తయారవ్వాలి. రతన్ టాటా పేరుతో అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నాం. పెట్టుబడులకు కావాల్సిన భూమి, నీళ్లు, మానవ వనరులు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా బెస్ట్ పాలసీలు ప్రకటించాం. మన రాష్ట్ర అభివృద్ధికి రతన్ టాటా ఎంతో కృషి చేశారు. రతన్ టాటా వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ముఖ్యమైన వాటాదారు. రాష్ట్ర అభివృద్ధికి టాటా చేపట్టే కార్యక్రమాలది కీలకపాత్ర. ఒక కుటుంబం..ఒక వ్యాపార వేత్త కావాలంటే టీచర్లతోనే సాధ్యపడుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నెంబర్-1 గా ఉండాలి... దీనికి టీచర్లే నాంది పలకాలి. ప్రతి టీచర్ విజ్ఞాన గనిగా తయారవ్వాలి. మీరు మాట్లాడే ప్రతి మాట, అనుసరించే ప్రతి విధానం విద్యార్ధుల్లో స్ఫూర్తినింపాలి. వినూత్న ఆలోచనలు చేసే వారే ముందుకెళ్తారు. మీ గౌరవాన్ని, ప్రతిష్టను నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందా. ప్రపంచంలో మన దేశం, దేశంలో మన రాష్ట్రం అగ్రభాగాన ఉండేలా చేసుకుందాం. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలుగుజాతి ఉండాలనేది నా ఆకాంక్ష...కోరిక.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.