డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ తో పాటు ప్రతి నెల స్టైఫండ్
డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ తో పాటు ప్రతి నెల స్టైఫండ్
ఈ నెల 16 నుంచి ప్రారంభం
ఒక్కో సెంటర్ లో 200 మంది అభ్యర్థులకు శిక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి..
అదనంగా 520 మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా శిక్షణ
నెలకు రూ.1500ల స్టయిఫండ్..మెటీరియల్ లో అదనంగా మరో రూ.వెయ్యి
ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ ఉచిత కోచింగ్
ఈ నెల 18న రాష్ట్ర పండగగా కనకదాస జయంతి
బడ్జెట్ భేష్ : మంత్రి సవిత
అమరావతి : బీసీ స్డడీళ్ల సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 16 నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిచనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరులో డీఎస్సీ కోచింగ్ సెంటర్ల ను తాను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కోచింగ్ సెంటర్ లో 200 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు.
2 నెలల పాటు ఇవ్వనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో నెలకు 1500 రూపాయి చొప్పున స్టయి ఫండ్ అందజేయనున్నామన్నారు. మెటీరియల్ కోసం అదనంగా మరో రూ.1000లు ఇవ్వనున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో ఆయా సబ్జెక్టులపై బోధన అందించనున్నామన్నారు.
ఆఫ్ లైన్లోనూ కోచింగ్..
ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆసక్తి చూపిన వారందరికీ శిక్షణివ్వనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేశామన్నారు. ఈ యాప్ లో సబ్జెక్టుల వారీగా నిపుణులైన వారితో క్లాసుల నిర్వహిస్తున్నామన్నారు. క్లాసులతో ఈ యాప్ లో పాత క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
బీఈడీ అర్హతతో పాటు టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. ఆన్ లైన్ అభ్యర్థులకు తమకిష్టమైన సమయాల్లో యాప్ ను ఓపెన్ చేసుకుని క్లాసులు వినే అవకాశం
ఆన్ లైన్ కోచింగ్ తో గృహిణులకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఆఫ్ లైన్...ఆన్ లైన్...ఏదో ఒకే విధానంలో మాత్రమే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
రాష్ట్ర పండగగా కనకదాస జయంతి..
ఈ నెల 18న గురు కనకదాస జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
తన కీర్తనలు, సాహిత్యంతో సమాజ అసమానతలపై గొంతెత్తిన సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త గురు కనకదాస అని అన్నారు. కర్నాటకలో జన్మంచిన కనకదాస... రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని అన్నారు. ఇటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ కనకదాస జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అనంతపురంలో నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. బీసీలను, వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ... వారి ఉన్నతి కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ప్రాధాన్యతమిస్తున్నారన్నారు. ఇటీవలే వాల్మీకి జయంతిని, విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండగలు జరుపుకున్నామన్నారు. ఇపుడు గురు కనకదాస జయంతిని కూడా రాష్ట్ర పండుగగా జరుపుకోబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, కమిషనర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ భేష్... : మంత్రి సవిత
సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన భేషుగ్గా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస.సవిత కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడుతూనే, బడ్జెట్లో సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ.73,720 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించారన్నారు. అందులో బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యమిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల పథకానికి, నిరుద్యోగ వేడ పండితులకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిని సంభావనరూపంలో ఇవ్వడానికి నిర్ణయించారన్నారు. మిగిలిన పథకాలను త్వరలో అమలు చేయనున్నారని మంత్రి తెలిపారు. బీసీ సంక్షేమానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించడంపై బీసీ సంఘాల నుంచి విశేష స్పందన వస్తోందని మంత్రి సవిత తెలిపారు.