సరస్వతి పవర్ కోసం దళితుల భూములు లాక్కున్నారు
సరస్వతి పవర్ కోసం దళితుల భూములు లాక్కున్నారు
ప్రజలను భయపెట్టి తీసుకున్న ఆస్తిని కుటుంబ ఆస్తిలా గొడవలాడుకుంటున్నారు
చుక్కల భూములు, అసైన్డ్ భూములపై సమగ్ర నివేదిక కోరుతాం
లేని కంపెనీ కోసం 196 కోట్ల లీటర్ల నీటిని కేటాయించుకున్నారు
అటవీ భూముల రికార్డులు మార్చారు
పెట్రోల్ l బాంబులు వేసి రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసి భూములు తీసుకున్నారు
భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నాం
పల్నాడు జిల్లా, మాచవరం మండలం, వేమవరం గ్రామంలోని సరస్వతి పవర్ భూములను స్వయంగా పరిశీలించి, మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్
'రైతులను భయపెట్టి, వారి పొలాలపై పెట్రోలు బాంబులు వేసి లాక్కున్న భూములు.. కుటుంబ ఆస్తి అయినట్లు మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారు. భవిష్యత్తు బాగుంటుందని, తమ కుటుంబ సభ్యులకు ఉపాధి దొరుకుతుందనే ఆశతో సరస్వతి పవర్ కు భూములు ఇచ్చిన రైతుల ఆశ తీరలేదు. పెడతామని చెప్పిన పరిశ్రమ రాలేదు... రైతుల ఆకాంక్ష గాలిలో కలిసిపోయింద'ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్ భూముల సేకరణకు బీజం పడిందని, కేప్టివ్ పవర్ పేరుతో అనుమతులు రావనే కారణంతో సిమెంటు కంపెనీగా మార్చి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని ఇక్కడ భూములను తీసుకున్నారన్నారు. భూముల్లో సుమారు 400 ఎకరాలకు పైగా అటవీ భూములను రెవెన్యూ రికార్డులు మార్చినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, దీనిపై జిల్లా కలెక్టరు సమగ్ర నివేదిక అందించేలా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పల్నాడు జిల్లా, మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలోనూ, వేమవరంలో ఉన్న సరస్వతి పవర్ భూములను మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
కాన్వాయ్ నుంచి కిందికి దిగేందుకు కూడా అవకాశం లేనంత జనసందోహం తరలిరావడంతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారు పైకి ఎక్కి భూములను పరిశీలించారు. అంతకు ముందు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో ఇక్కడి భూముల వివరాలపై చర్చించారు.
భూముల పరిశీలన తరవాత కాన్వాయ్ వాహనం నుంచే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘సరస్వతి పవర్ కంపెనీలో వైఎస్ కుటుంబానికి 86 శాతం వాటా ఉంది. ఇది వారి కుటుంబ కంపెనీ. ఇక్కడ పరిశ్రమ నెలకొల్పుతామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి రైతుల వద్ద భారీగా భూములు తక్కువ ధరకే తీసుకున్నారు. ఇవ్వని వారిని బెదిరించి, పెట్రోలు బాంబులు వేసి మరీ భూములు లాక్కున్నారు. స్పీకర్ గా చేసిన దివంగత డా.కోడెల శివప్రసాద్ ని అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు రాద్దాంతం చేశారు.
దీనిపై కోడెల శివప్రసాద్ అప్పట్లోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసి.. తీసుకెళ్లిన ఫర్నిచర్ కు తగిన డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పినా వినకుండా, వైసీపీ నాయకులు రకరకాల మాటలతో వేధించారు. ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి రైతుల వద్ద నుంచి ఇంత భారీ స్థాయిలో భూములు తీసేసుకున్నారు. పరిశ్రమ కూడా పెట్టలేదు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి.
• చుక్కల భూములు.. అసైన్డ్ భూమలున్నాయి
సరస్వతి పవర్ కోసం తీసుకున్న భూముల్లో వేమవరంలో 710.06 ఎకరాలు, చెన్నాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగెడ గ్రామంలో 107.36 ఎకరాలతో సహా మొత్తంగా రైతుల వద్ద నుంచి 1184 ఎకరాలు తీసుకున్నారు. పట్టా భూమి 1043.75 ఎకరాలు ఉంటే, చుక్కల భూమి 75 ఎకరాలు ఉంది. సరస్వతి పవర్ గొడవ బయటకు వచ్చినపుడు, ఈ భూముల్లో ఏమైనా నిబంధనల అతిక్రమణ జరిగిందా అని జిల్లా రెవెన్యూ అధికారులను నివేదిక కోరాం. వారిచ్చిన నివేదిక ప్రకారం 24 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు తేలింది.
ఎస్సీ వర్గాల్లో భూమి లేని నిరుపేదలకు సాగు కోసం ఇచ్చే అసైన్డ్ ల్యాండులను కూడా లాక్కున్నారు. ప్రతిసారీ క్లాస్ వార్ అని చెప్పే నాయకుడు దళితుల కడుపుకొట్టి వారి నుంచి భూములు లాక్కున్నట్లు తేలింది.
ఇదేనా గత ముఖ్యమంత్రి చెప్పిన క్లాస్ వార్..
ప్రజల వద్ద నుంచి చాలా వరకు బలవంతంగా, భయపెట్టి భూములు లాక్కున్నారు. ఖాళీ భూముల్లో పంటలు వేసుకున్న రైతులను సైతం పెట్రోలు బాంబులు వేసి భయపెట్టారు. ఫాక్షన్, రౌడీ మూకలతో ఈ ప్రాంతంలో విధ్వంసానికి దిగారు. ఇలా తీసుకొన్న ఈ ఆస్తిని కుటుంబ ఆస్తి అని గొడవలు పడుతున్నారు. ఇది ప్రజల ఆస్తి.
భయపెట్టి తీసుకున్నారు...
ఇక్కడి ప్రజలెవరు భూములను ఇష్టంగా ఇవ్వలేదు. భయపెట్టి బలవంతంగా తీసుకున్నారు. పరిశ్రమ వస్తుందని మాయ మాటలు చెప్పారు. ఇలా భయపెట్టి తీసుకున్న భూములే అధికంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిని వదిలేస్తే మరింత పెట్రేగిపోతారు. నేను ప్రజలకు అండగా నిలవడటానికి, వారికి భరోసా ఇవ్వడానికి వచ్చాను. తీసుకున్న భూమి కాకుండా మరో 350 ఎకరాలను కలుపుకొన్నారు. వారు చెప్పిన ఫాక్టరీ రాలేదు. యువతకు ఉపాధి దొరకలేదు. మొత్తం భూముల్లో వాగులు, వంకలు ఉన్నాయి. 400 ఎకరాల వరకు ఉన్న అటవీ భూమిని రికార్డులు మార్చి తీసుకున్నారని రైతులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తున్నాను. అసలు భూములు పరిస్థితి... తర్వాత మారిన రికార్డులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరుతున్నాను.
సిమెంటు ఫాక్టరీకు అవసరం అయ్యే ముడిసరకు ఈ భూముల్లో లభ్యం అయింది. ఇక్కడ లభించే సున్నపురాయిని 110 నుంచి 115 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే కాంక్లీర్ ఉత్పత్తి అవుతుంది. దానికి జిప్సం కలిపితే సిమెంటు ఉత్పత్తి సులభం అవుతుంది. దీనిలో అత్యంత విలువైన సున్నపురాయి ఉండటంతోనే భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో వివాదాలు మొదలయ్యాయి. 2009వ సంవత్సరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఈ భూముల్లో సున్నపురాయి లీజును 30 ఏళ్లకు తీసుకున్నారు. మళ్లీ వైసీపీ నాయకుడు 2019 లో ముఖ్యమంత్రి అవగానే ఆ లీజును 50 ఏళ్లకు పెంచుకున్నారు. కేప్టివ్ పవర్ గా సరస్వతి నమోదు అయినా, అలా దరఖాస్తులు చేస్తే అనుమతులు రావనే కారణంతో సరస్వతి సిమెంటును నెలకొల్పారు. దీనికి పర్యావరణ అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. ఇక నిర్మించని కంపెనీ కోసం ఏకంగా కృష్ణానది నుంచి 196 కోట్ల లీటర్ల నీటిని తీసుకునేందుకు అనుమతి పొందారు. దీనిపై ఉపేక్షించేది లేదు. క్యాబినెట్ లో ఈ అంశం గురించి మాట్లాడుతాను. భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి, తదుపరి చర్యలు తీసుకుంటాం. పోలీసులు కూడా మెతకతనం వీడి, సరస్వతి భూముల్లో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలవాలి. వారిపై రౌడీ మూకలు, అసాంఘిక శక్తులు బల ప్రయోగం చేస్తే దాన్ని నిరోధించాలి. నేను ప్రజల కోసం బలంగా నిలబడాలని బలంగా అనుకున్నాను. వైసీపీ మద్దతుదారులు ట్రోలింగ్ లు, విమర్శలు నన్ను ఏమీ చేయలేవు. నా పని నేను స్వచ్ఛంగా చేస్తూ ముందుకు వెళ్తాను’’ అన్నారు.
పవన్ కళ్యాణ్ వెంట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ రాకతో పులకించిన పల్నాడు
సరస్వతి పవర్ ప్రాజెక్టు భూముల పరిశీలనకు పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం బయల్దేరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పల్నాడు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పల్నాడులో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల ప్రాంతాల్లో ప్రజలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తన రోడ్ల మీదకు తరలివచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా జనసైనికులు, వీరమహిళలు పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ వాహనశ్రేణిని అనుసరిస్తూ జనసేన శ్రేణులు బైకులు, కార్లతో భారీ ర్యాలీ చేపట్టాయి.