విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి
విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి
• కొండపి ఎంజేపీ విద్యార్థిపై వేడి పాలు పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం
• గురుకులం కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన మంత్రి సవిత
• గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశం
• విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గురుకుల కార్యదర్శి మాధవీలత వెల్లడి
• విద్యార్థి ఆరోగ్యంపై మంత్రి బాలవీరాంజనేయులతోనూ ఆరా
• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
కొండపి ఎంజేపీ బాలుర పాఠశాలలో వేడి పాలు పడి విద్యార్థి గాయపడిన ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది నితంతరం అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల భద్రత పట్ల బాధ్యతతో మెలగాలని గురుకులం కార్యదర్శి మాధవీలతను ఫోన్లో ఆదేశించారు. గురువారం ఉదయం కొండపి ఎంజేపీ బాలుర పాఠశాలలో అయిదో తరగతి చదువున్న మధుమోహన్ పాలు తాగడానికి కిచెన్ రూమ్ కు వెళ్లాడు. పాలు తాగి వస్తున్న క్రమంలో పక్కన టేబుల్ పై ఉన్న వేడి పాలుతో ఉన్న గిన్నె దొర్లి మధుమోహన్ పై పడిపోయింది. దీంతో బాలుడి చాతి కింద, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఇన్చార్జి అంకిరెడ్డి బాలునికి వైద్య సేవలందించారు. ఘటన జరిగిన వెంటనే ఎంజేపీ ఇన్చార్జి వార్డెన్ స్రవంతి బాలుని తల్లిదండ్రులకు సమాచారమందించారు.
మంత్రి సవిత ఆగ్రహం..
విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సవిత గురుకులం కార్యదర్శి మాధవీలతతో ఫోన్ లో మాట్లాడారు. బాలుని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుని ఆరోగ్యం నిలకడగా ఉందని, తీవ్ర గాయాలు కావడంతో మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు వెల్లడించారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, బాలునికి మెరుగైన వైద్యమందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు బాలుని ఆరోగ్యంపై వివరాలు అందివ్వాలని స్పష్టంచేశారు. వేడి పాలు ఉన్నచోట హాస్టల్ నిర్వాహాకులు, సిబ్బంది లేకపోవడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు.
మంత్రి వీరాంజనేయులతోనూ మాట్లాడిన సవిత..
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డొక్కా బాలవీరాంజనేయులతోనూ మంత్రి సవిత మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మంత్రి బాలవీరాంజనేయులు ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి, విద్యార్థికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. ఎంజేపీ స్కూల్లో జరిగిన ఘటనపై మంత్రి సవితకు మంత్రి బాలవీరాంజనేయులు సమాచారమందించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు.