Kisan Credit Card: రైతులు ఇలా 'కిసాన్ క్రెడిట్ కార్డ్' అప్లై చేసుకోండి.. రూ.5లక్షల రుణం పొందండి
Kisan Credit Card: రైతులు ఇలా 'కిసాన్ క్రెడిట్ కార్డ్' అప్లై చేసుకోండి.. రూ.5లక్షల రుణం పొందండి
• కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి రూ.5లక్షల వరకు పెంచిన కేంద్రం..
• ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు ఇలా చేసుకోండి..
Kisan Credit Card: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వేతన జీవులతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఊరటనిచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చే రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి 5 లక్షలకు పెంచగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందనున్నారని వెల్లడించింది. శుక్రవారం పార్లమెంట్ లో సమర్పించిన ఆర్థిక సర్వే 2024-25లో ప్రకారం 2024 మార్చి వరకు కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య 7.75 కోట్లు కాగా, రూ.9.81లక్షల కోట్ల రుణాలు అందించారు.
నాబార్డ్ సిఫార్సుపై 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ప్రారంభమైంది. తద్వారా వ్యవసాయ పరికరాలతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తోంది. రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించడంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంతో ఉపయోగపడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని రూ.5లక్షలకు పెంచగా వడ్డీ రేటును 7శాతానికి పెంచారు. సకాలంలో రుణం చెల్లించే రైతులకు 3శాతం సబ్సిడీ కల్పిస్తుండగా మరో 4శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే అంటే 35పైసల వడ్డీ మాత్రమే పడుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పక్రియ ఇలా..
కిసాన్ క్రెడిట్ కార్డు లబ్ధిదారులకు కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. భారతీయ పౌరుడు కావడంతోపాటు వయస్సు 18 నుంచి 75ఏళ్ల మధ్య ఉండాలి.ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు పొందవచ్చు.కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలనుకునేవారు ఆఫ్లైన్, ఆన్లైన్లో నూ దరఖాస్తు చేసుకోవచ్చు.రైతులు తమ పరిధిలోని బ్యాంకుకు వెళ్లి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు ఆధార్, పాన్ కార్డు, భూమి పత్రాలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో సహా పలు పత్రాలను సమర్పించాలి.
పీఎం కిసాన్ యోజన వెబ్ సైట్ లేదా సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు ఫామ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/personal-banking/home ఇలా సంప్రదించాలి. అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్యాబ్ కు వెళ్లి క్రాపో లోన్ ఆప్షన్లో కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ను ఎంచుకోవాలి. దరఖాస్తు ఫామ్ డౌన్ లోడ్ చేసుకోని వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత నాలుగు రోజుల్లోగా సంబంధింత బ్యాంకు నుంచి సంప్రదిస్తారు. వారి సూచన మేరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.కిసాన్ క్రెడిట్ కార్డుపై లావాదేవీలపై ఏడాదికి రెండు సార్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికోసారి వడ్డీతో సహా రుణాన్ని డిపాజిట్ చేయాలి. రైతులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి మరుసటి రోజు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక రైతు ఏడాదికి రెండుసార్లు వడ్డీ చెల్లించడంతో పాటు ఒకసారి లోన్ మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. లేని పక్షంలో 7శాతం వడ్డీ పడుతుంది. సకాలంలో వడ్డీ చెల్లించకపోతే మీఖాతా డిఫాల్ట్ గా నమోదవుతుంది.