PM KISAN: 24న పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల
PM KISAN: 24న పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల
ఫిబ్రవరి 24న విడుదల కానున్న పీఎం కిసాన్ నిధులు
రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున నిధుల జమ
19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
PM KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులను విడుదల చేయనున్నారు.
19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఈ-కేవైసీ చేసి ఉండాలి.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి లేదా పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందో లేదో చూడడానికి పీఎం కిసాన్ ప్రభుత్వ వెబ్ సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి వివరాలు పొందవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది.
e-KYC చేయడం ఎందుకు అవసరం?
దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనాలు చేరేలా & మధ్యవర్తుల ప్రమేయం ఉండకుండా eKYC చేయడం అవసరం. మోసం జరిగే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.
e-KYC పద్ధతులు
PM కిసాన్ యోజన లబ్ధిదారులు eKYC పూర్తి చేసేందుకు మూడు పద్ధతులు ఉన్నాయి..
1. OTP ఆధారిత e-KYC (PM-KISAN పోర్టల్ & మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది)
2. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) & స్టేట్ సర్వీస్ సెంటర్లలో (SSC) అందుబాటులో ఉంది.
3. ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈ-కేవైసీ (పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది), దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఉపయోగిస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, భూమి యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం..
• పీఎం-కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్టర్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి, అన్ని వివరాలు పూర్తి చేయండి.
• మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.
• మీ రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించండి.
• స్థానిక రెవెన్యూ అధికారిని సంప్రదించండి.