JOBS: పదో తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు
JOBS: పదో తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు
• నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు నోటిఫికేషన్..
• మొత్తం 300 పోస్ట్లులకు నోటిఫికేషన్..
• ఏప్రిల్ మాసంలో తొలి విడత పరీక్ష..
పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు భారత తీరదళంలో చక్కటి ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు విభాగాల్లో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ టెస్టు, వైద్య పరీక్షలతోపాటు రాత పరీక్ష ద్వారా సెలక్ట్ చేస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగ నియామకాలు ప్రతిఏటా రెండుసార్లు చేపడుతుంటారు. పురుషులు మాత్రమే అర్హులు. పరీక్ష నాలుగు దశల్లో ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..
పోస్టుల వివరాలు
నావిక్ డొమెస్టిక్:
ఇందులో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ బ్రాంచీకి ఎంపికైనవారు కుకింగ్, స్టివార్డ్ పనులు చేస్తారు. టెన్త్ పాసైనవారు పోటీ పడవచ్చు.
నావిక్ జనరల్:
ఇందులో 260 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్) పాసైనవారు అర్హులు. వీరు సంబంధిత ట్రేడ్లలో డ్యూటీ చేస్తారు.
వయసు:
రెండు పోస్టులకూ 2003 సెప్టెంబరు 1 - 2007 ఆగస్టు 31 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
• ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
• రూ.300 ఫీజు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు.)
పరీక్ష టైమ్:
స్టేజ్ 1 పరీక్షలు ఏప్రిల్‌లో, స్జేజ్ 2 పరీక్షలు జూన్‌లో, స్టేజ్ 3 పరీక్షలు సెప్టెంబరులో ఉంటాయి.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/cgcat/
శిక్షణ, వేతనం:
ప్రాథమిక శిక్షణ "INS చిల్క"లో నిర్వహిస్తారు. ఆ తర్వాత సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ ట్రైనింగ్ ఉంటుంది. సక్సెస్ ఫుల్గా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారిని జాబ్లోకి తీసుకుంటారు. వీరికి లెవెల్-3 ఉద్యోగి కింద రూ.21,700 బేసిక్ సాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని ప్రోత్సాహకాలు కలిపి మొదటి నెల జీతమే దాదాపు రూ.40 వేలు అందుకుంటారు. భవిష్యత్తులో లెవెల్-8 (ప్రధాన అధికారి) స్థాయి వరకు చేరుకోవచ్చు.
రాత పరీక్ష విధానం ఇలా:
• ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు.
• డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.
• 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. (మ్యాథ్స్ 20, ఇంగ్లిష్ 15, రీజనింగ్ 10, సైన్స్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష టైమ్ 45 నిమిషాలు.
• జనరల్ డ్యూటీ పోస్టు వాళ్లు మాత్రం అదనంగా సెక్షన్ 2 రాయాలి. ఈ ఎగ్జామ్ 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు ఇస్తారు. 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇంటర్ ఫిజిక్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
• రెండు సెక్షన్లలోనూ కనీస మార్కులు పొందాలి. జనరల్ అభ్యర్థులకు సెక్షన్-1లో 30, సెక్షన్-2లో 20 మార్కులు తప్పక రావాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్-1లో 27, సెక్షన్-2లో 17 మార్కులు పొందాలి.
• ఈ కనీస మార్కులు వచ్చిన వారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
రెండో దశ:
• ఈ స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థి కనీసం 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి.
• 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి.
• 20 సీటప్స్, 10 పుష్-అప్స్ తీయాలి.
• ఛాతీ ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు విస్తరించడం తప్పనిసరి.
మూడో దశ:
• రెండో స్టేజ్లో అర్హత సాధించిన వారిని మూడో దశకు సెలక్ట్ చేస్తారు. అయితే స్టేజ్-1 మెరిట్ చూస్తారని గుర్తుంచుకోవాలి.
• ఎంపికైన వారికి "INS చిల్క"లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులు నెక్స్ట్ స్టేజ్కు చేరుకుంటారు.
నాలుగో దశ:
ఇది చివరి స్టేజ్. ఇక్కడ అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే ట్రైనింగ్కు తీసుకెళ్తారు.