Blue flag: రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్
Blue flag: రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్
రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్..
బీచ్ సౌందర్యం,స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని తెలిపిన మంత్రి దుర్గేష్
రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్న మంత్రి దుర్గేష్
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపిన మంత్రి దుర్గేష్
నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపు
బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపు
అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్
భూములు అన్యాక్రాంతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించిన మంత్రి దుర్గేష్
విశాఖపట్నం, (పీపుల్స్ మోటివేషన్):-
విశాఖపట్నంలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూఫ్లాగ్ జెండా ఆవిష్కరించారు. సోమవారం ఉదయాన్నే విశాఖపట్నం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దు అయిందని, తమ దృష్టికి రాగానే వెంటనే దాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు అన్నీ తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తోడ్పడుతుందని ఈ నేపథ్యంలో బీచ్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరంగా ఉండేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ ల నేతృత్వంలో ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసుకున్నామన్నారు. బీచ్ లను పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బ్లూఫ్లాగ్ బీచ్ పదికాలాల పాటు నిలబడాలన్నా, పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలన్నా ప్రజలు, స్థానికుల భాగస్వామ్యం చాలా అవసరమన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను డెన్మార్క్ కు సంబంధించిన సంస్థ తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించిందనే విషయాన్ని గుర్తుచేశారు. పూర్తిగా రద్దుచేస్తామని సంబంధిత నిర్వాహకులు ఎక్కడా చెప్పలేదన్నారు. తాత్కాలిక ఉపసంహరణ ద్వారా నిర్వహణ సామర్థ్యం పెంచుకునే బాధ్యతను గుర్తుచేసిందన్నారు. ఈ క్రమంలో విశాఖ రుషికొండ బీచ్ కి బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ జరిగిందన్నారు.
రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం సులభమే కానీ వాటి సమర్థ నిర్వహణకు సమైక్యంగా పనిచేయాల్సిన అవసరముందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. బీచ్ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా చెత్తవేయకూడదని, సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సహా ఏది పడితే అది విసిరివేయకూడదని, నీటిని కలుషితం చేయకూడదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పర్యాటకులకు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఈ ప్రదేశంలో నిర్ణయించిన నిర్దేశిత విధానాలను ప్రజలు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. బీచ్ కు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దీనివల్ల బీచ్లోని పరిశుభ్రత, ఇతర సదుపాయాలు అన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత పర్యాటక శాఖపై ఉందని చెప్పారు.
పర్యాటక శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది:మంత్రి దుర్గేష్
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని తెలుపుతూ కొత్త పర్యాటక పాలసీని తీసుకొచ్చామని, పర్యాటక రంగానికి పరిశ్రమహోదా కల్పించామని గుర్తుచేశారు.ఈ నేపథ్యంలో ప్రత్యేకించి విశాఖపట్నంలోని పర్యాటక శాఖ అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలన్నారు. విశాఖను అందంగా నిర్మించేందుకు అందరం మరింత కష్టపడదామన్నారు. ఈ క్రమంలో బాంబూ పాసింగ్ పేస్ లాంటివి ఏర్పాటు చేద్దామన్నారు.బీర్, వైన్ తదితర బీచ్ శాక్స్ ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. తద్వారా పర్యాటకాభివృధ్ధితో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యేందుకు అవకాశముంటుందన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టిలో ఉంచామన్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నామన్నారు.
స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం: మంత్రి దుర్గేష్
రాష్ట్రంలోని 974 కి.మీల సుదీర్ఘ సముద్ర తీరంలో ఉన్న ఎన్నో బీచ్ ల్లో విశాఖలోని రుషికొండ బీచ్ కు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. సహజ సిద్ధ అందాలు, చుట్టూ ఉన్న ప్రకృతి సంపద, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ జ్ఞానాన్ని అందించేలా బ్లూఫ్లాగ్ బీచ్ తయారుకావాలన్నారు.రుషికొండ సాధారణ బీచ్ కాదని కష్టపడి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ తెచ్చుకున్నామని వివరించారు. బీచ్ లో సౌందర్యానికి, స్వచ్ఛతకు పెద్దపీట వేయాలన్నారు. బీచ్ లో అంతర్జాతీయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.స్థానికంగా ఉపాధి పొందుతున్న మత్స్యకారుల జీవితాలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తమదన్నారు. నిబంధనల ప్రకారం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజాప్రతినిధులుగా మానవీయ కోణం ఆవిష్కరించే బాధ్యత తమకు ఉంటుందన్నారు.ఇక్కడ భూములు అన్యాక్రాంతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. స్థానిక ప్రజల అవసరాలు గుర్తిస్తామన్నారు. తదనుగుణంగానే తమ పద్ధతులుంటాయన్నారు.
అంతిమంగా రుషికొండలో బ్లూఫాగ్ బీచ్ రెపరెపలాడేలా చేశామన్నారు. కూటమి ప్రభుత్వం కూడా రెపరెపలాడే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. బ్లూఫ్లాగ్ అజరామంగా నిలిచేందుకు తాము కృషి చేస్తామన్నారు. ఉగాది నుండి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ఎలా జరపాలి అన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమం ప్రారంభించబోతున్నారని తెలిపారు. తద్వారా పరిపాలనో ప్రజల భాగస్వామ్య ఆవశ్యకతను వివరించనున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పర్యాటకశాఖ అభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి దుర్గేష్ పలువురికి లైఫ్ జాకెట్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఛైర్మన్ డా.నూకసాని బాలాజీ, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధర ప్రసాద్, పర్యాటక శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.