Health tips: ప్రతి రోజూ సజ్జలతో చేసిన రొట్టెలను తింటే ఇన్ని ప్రయోజనాలా..?
Health tips: ప్రతి రోజూ సజ్జలతో చేసిన రొట్టెలను తింటే ఇన్ని ప్రయోజనాలా..?
ఒకప్పుడు మన పూర్వీకులు చిరు ధాన్యాలనే ఆహారంగా తినేవారు. వారికి అన్నం సరిగ్గా లభించేది కాదు. దీంతో అన్నాన్ని ఎప్పుడో పండుగలు లేదా శుభ కార్యాల సమయంలోనే తినేవారు. రోజూమాత్రం చిరు ధాన్యాలనే తినేవారు. వాటిల్లో రాగులు, సజ్జలు, జొన్నలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా మంది తిన్న ఆహారాల్లో జొన్నల తరువాతి స్థానంలో రాగులు నిలుస్తాయి. కేవలం మన దేశంలోనే కాదు, ఆఫ్రికా దేశాల వాసులు కూడా సజ్జలను అధికంగా తింటారు. అందుకనే వారు అంత దృఢంగా ఉంటారు. సజ్జల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. సజ్జలను పిండి చేసి దాంతో జావ లేదా రొట్టె, ఉప్మా వంటివి చేసి తినవచ్చు. సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
షుగర్ లెవల్స్ కంట్రోల్..
100 గ్రాముల సజ్జలను తింటే మనకు సుమారుగా 378 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 73.97 గ్రాములు, ఫైబర్ 8.5 గ్రాములు, 10.67 గ్రాముల ప్రోటీన్లు, 4.07 గ్రాముల కొవ్వులు, బి కాంప్లెక్స్ విటమిన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు మంచి మొత్తాల్లో లభిస్తాయి. అందువల్ల సజ్జలను పోషకాలకు నెలవుగా చెబుతారు. సజ్జలను రోజూ తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పిండి పదార్థాలు అధికంగా ఉన్నప్పటికీ ఇవి త్వరగా రక్తంలో కలవవు. పైగా సజ్జల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు సజ్జలను తింటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మధుమేహం అదుపులో ఉంటుంది. రోజూ రాత్రి పూట సజ్జలతో తయారు చేసిన రొట్టెలను తింటుంటే మేలు జరుగుతుంది.
కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్..
సజ్జలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. సజ్జలను ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు సైతం అధికంగానే లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందివ్వడంతోపాటు కండరాలను నిర్మిస్తాయి. దీంతో దేహం చక్కని ఆకృతిని పొందుతుంది. అలాగే సజ్జలను తింటే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
సమృద్ధిగా పోషకాలు..
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడే మహిళలకు సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ అలాంటి మహిళలు రోజూ సజ్జలను తింటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు కలుగుతారు. సజ్జల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ. మెరుగు పడేలా చేస్తుంది. వీటిని తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉండవు. రోజూ రాత్రి సజ్జలతో తయారు చేసిన జావ లేదా రొట్టెలను తింటే మలబద్దకం తగ్గుతుంది. సజ్జల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సహజసిద్ధమైన డిటాక్స్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల సజ్జలను తింటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. ఇలా సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవడంతోపాటు పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.