రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం

• పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ముందుకు

• పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నాం

• గుంతలు లేని రహదారులు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాల కల్పన

• కూటమి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పారిపాలన

• పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సహకారం అవసరం

• 16వ ఆర్థిక సంఘంతో సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పవన్ కళ్యాణ్

Andhra Pradesh CM Nara Chandrababu Naidu deputy CM Pawan Kalyan 16th finance commission chairman aravinda panagaria

‘గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బలోపేతం దేశానికి అవసరం. వికసిత్ భారత్ అనే మహా లక్ష్యంలో గ్రామీణాంధ్ర ప్రదేశ్ కీలకం. పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వెళ్తోంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్యపడుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పర్యావరణహితంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్థిక సంఘం సహాయ సహకారాలతో పని చేస్తామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తామంతా కంకణబద్దులై ఉన్నట్టు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు 16వ ఆర్థిక సంఘం పూర్తి స్థాయిలో సహకరిస్తుందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగరియా గారు, ఇతర సభ్యులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందుకు ఉంచారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ”మహాత్మా గాంధీ చెప్పినట్టు భారత దేశ భవిష్యత్తుకు పల్లెలే పట్టుగొమ్మలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయన్న నమ్మకం మాకు ఉంది. వికసిత్ భారత్ లో గ్రామాలకు సమాన పాత్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఉమ్మడిగా పని చేయడం బరువు కాదు బాధ్యతగా భావిస్తోంది. 

ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయనున్నాం. దీంతోపాటు వ్యవసాయం, మార్కెట్, రోడ్లు, గ్రామీణ పంపిణీ హబ్ ల ఏర్పాటు, గుంతలు లేని రహదారుల నిర్మాణం ధ్యేయంగా పెట్టుకున్నాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏకీకృత సేవల విధానం సిబ్బంది నియామకాలతోపాటు నైపుణ్య సామర్థ్యాల పెంపుదల, క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే పనుల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయడంతో పాటు ఓ పారదర్శక విధానానికి నాంది పలికాము.

• గ్రామాల్లో జాతీయ భావం పెంపొందించేందుకు చర్యలు

పంచాయతీల్లో జాతీయ భావాన్ని పెంపొందించే క్రమంలో గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా నిర్వహణ వ్యయాన్ని రూ. 100 నుంచి రూ. 10 వేలకు, రూ. 250 నుంచి రూ.25 వేలకు పెంచడం ద్వారా జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించుకునే ఏర్పాటు చేశాము. పంచాయతీల్లో జాతీయ భావం పెంపొందేలా చర్యలు చేపట్టాము. 

గ్రామాల్లో కలప మొక్కల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి, సినిమా రంగం, మీడియా వ్యవస్థల నిర్వహణ అనువైన పరిస్థితులు తీసుకురావడం, ఇతర స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపర్చడం ద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. స్థానికంగా ఉన్న ప్రతికూలతలను అవకాశాలుగా మలచుకునేలా మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాము. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో గో సంరక్షణ నిమిత్తం గోకులాల నిర్మాణం, హర్టీకల్చర్ కు ప్రోత్సాహకాలు అందించడం, గిరిజన మరియు పీవీటీజీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాము. పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులు అని నమ్ముతున్నాము. జాతీయ వృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకం. ఇబ్బందులు ఉన్నప్పటికీ 2024 - 2025 ఆర్థిక సంవత్పరంలో దాదాపు రూ. 800 కోట్ల ఇంటి పన్నును వసూలు చేశాము. పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషన్స్ విస్తరణ ద్వారా ఆర్ధికంగ వృద్ధిని సాధన దిశగా అడుగులు వేస్తున్నాము.

• పాలనా వ్యవస్థల్ని ఏకతాటి మీదకు తీసుకువస్తాం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా సదుపాయం కల్పించి వాటిపై స్థానిక సంస్థల అజమాయిషీ కల్పించడం. ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి సంపద సృష్టించడం ద్వారా ఆదాయాన్ని అందించడం. చిట్టచివరి గ్రామాలను సైతం అనుసంధానిస్తూ ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నాము. 

పై లక్ష్యాల సాధనకు రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్ లు, 26 జిల్లా పరిషత్ లకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయాల్సి ఉంది. మా అంచనా మేరకు 2026-2027 నుంచి 2030-2031 వరకు ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థలకు రూ.62,515 కోట్ల మేర నిధుల లోటు ఉంటుందని భావిస్తున్నాము. ఉమ్మడి గ్రాంట్లలో అత్యధిక శాతం స్థానిక అవసరాల అభివృద్ధికి వినియోగించాలి. స్థానిక సంస్థలకు నిధులు నేరుగా పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. కూటమి ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పూర్తి స్థాయిలో సంస్కరణలు అమలు చేస్తూ.. పరిపాలనా వ్యవస్థలను ఏకతాటి మీదకు తీసుకురావడం ద్వారా వ్యవస్థల బలోపేతానికి కృషి చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Comments

-Advertisement-