చారిత్రక ఘట్టం... దేశపు తొలి ఏటీఎం ప్రారంభించిన ప్రధాని
చారిత్రక ఘట్టం... దేశపు తొలి ఏటీఎం ప్రారంభించిన ప్రధాని
పసిఫిక్ దీవి తువాలులో తొలి ఏటీఎం కేంద్రం ఏర్పాటు..
ప్రారంభోత్సవానికి స్వయంగా హాజరైన ప్రధాని ఫెలెటి టెయో..
దేశ చరిత్రలో ఇది కీలక మైలురాయి అని వెల్లడి..
సముద్ర మట్టం పెరుగుదలతో దేశం కనుమరుగయ్యే ప్రమాదం
సంస్కృతి పరిరక్షణకు డిజిటల్ దేశంగా మారే ప్రయత్నాలు
పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం తువాలులో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ అరుదైన కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరై, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం విశేషం. ఏప్రిల్ 15న జరిగిన ఈ ప్రారంభోత్సవం, తువాలు దేశానికి ఒక గొప్ప విజయంగా నిలిచింది.
ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉన్న తొమ్మిది దీవుల సమూహమే తువాలు. సుమారు 11,200 మంది జనాభా, కేవలం 10 చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఇది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటిగా ఉంది. ఇన్నాళ్లకు ఇక్కడ తొలి ఏటీఎం ఏర్పాటు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ ప్రధాని ఫెలెటి టెయో మాట్లాడుతూ, ఇది దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మైలురాయి అని పేర్కొన్నారు. మార్పునకు ఇది కీలకమైన ముందడుగు అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందించి ఈ ఏటీఎంను ఏర్పాటు చేసింది.
మరోవైపు, తువాలు తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా దేశ భూభాగం క్రమంగా కనుమరుగవుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని 40 శాతం మేర సముద్రంలో కలిసిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దశాబ్దం చివరి నాటికి దేశం పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉందని, గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి దేశంగా తువాలు నిలవనుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, తమ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు తువాలు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు, 'డిజిటల్ నేషన్'గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌతికంగా తువాలు కనుమరుగైనా, మెటావర్స్ వంటి అధునాతన సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని ప్రపంచ పర్యాటకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో, దేశంలో తొలి ఏటీఎం ఏర్పాటు కావడం, డిజిటల్ దిశగా పడుతున్న అడుగుల్లో ఒకటిగా భావిస్తున్నారు.