ఉచితంగా వచ్చే ఈ కార్డుతో ఎన్ని ప్రయోజనాలో.. ఇలా అప్లై చేసుకోండి.. పది నిమిషాల్లో కార్డు పొందండిలా.!
ఉచితంగా వచ్చే ఈ కార్డుతో ఎన్ని ప్రయోజనాలో.. ఇలా అప్లై చేసుకోండి.. పది నిమిషాల్లో కార్డు పొందండిలా.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయాల్లో ఆప్షన్ ఓపెన్ అయ్యిందని సిబ్బంది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సీనియర్ సిటిజన్ కార్డు కోసం పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, కుల ధ్రువపత్రం తదితర వివరాలతో మీ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌తో లింక్ అయ్యి సిమ్ ఉన్న ఫోన్ తీసుకెళ్లాలి. కార్డు జారీ ప్రక్రియ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అలాగే జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు.
దేశవ్యాప్తంగా చెల్లుబాటు:
సీనియర్ సిటిజన్ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను సులభంగా, వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఈ కార్డు ఉండే ప్రతిసారీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా ఆ వ్యక్తి వయస్సు ఎంతో తెలుస్తోంది. ప్రతిసారీ ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు రుజువుగా చూపించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ కల్పిస్తారు. వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు సైతం సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడుతుంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది.
ప్రయోజనాలు:
సీనియర్ సిటిజన్ కార్డుతో ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌లో 25 శాతం రాయితీ కల్పిస్తారు. అలాగే దూర ప్రాంతాల బస్సులు మినహా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు. రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారికి వీల్‌ఛైర్ సదుపాయం కల్పిస్తారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. పాస్‌పోర్ట్ సేవా ఫీజుల్లో 10 శాతం రాయితీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ, 80 ఏళ్లు దాటితే 1 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.
పన్ను మినహాయింపులు:
సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారి పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. 60 ఏళ్లు పైబడితే 3 లక్షల వరకు 80 ఏళ్లు దాటితే 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
బ్యాంకింగ్ సేవల్లోనూ:
బ్యాంకుల్లో స్పెషల్ క్యూ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఓ కౌంటర్ ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 0.5 శాతం అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లుపైబడిన వారికి 1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో 80 ఏళ్లుపైబడిన వారికి 8.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7.9% వడ్డీరేటు ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల కంటే ఎక్కువగా ఉంటుంది.