రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏఐ పోలీస్ బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుంది

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ఏఐ పోలీస్ బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుంది

నేరాన్ని బట్టి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సిన సెక్షన్లూ చెప్పేస్తుంది

క్రైమ్‌ సీన్‌లో ఆధారాల సేకరణ నుంచి దర్యాప్తు దారి చెబుతుంది

డిఫెన్స్‌ లాయర్‌ ఏమి వాదిస్తారో చెబుతూనే కౌంటర్‌ సూచిస్తుంది

AI police Andhra Pradesh

ఏలూరులో ట్రయల్‌ సక్సెస్‌... త్వరలో 175 పీఎస్‌లలో అందుబాటులోకి అత్యాధునిక సాంకేతికతతో ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలను అందించాలన్న చంద్రబాబు లక్ష్యాన్ని ఏపీ పోలీసులు అందిపుచ్చుకున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో 'టెక్నాలజీ పోలీస్'గా ఎదగడానికి అడుగులు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకుంటోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో చార్జిషీట్‌ వరకూ అంతా ఏఐ తోనే అని అంటోంది. ఏఐ ప్రపంచాన్ని ఏలుతున్న కాలమిది. దానిని ముందుగా అందింపుచ్చుకున్న వారిదే ఆ రంగంలో విజయం. ఆంధ్ర పోలీస్‌ తన సత్తాను చాటడానికి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకూ ఏలూరు జిల్లాలోని ఓ స్టేషన్‌కు పరిమితమైన ట్రయల్‌ రన్‌ను ఇప్పుడు మరిన్ని పోలీస్‌ స్టేషన్లకు విస్తరిస్తున్నారు.

మార్పు బాటలో జైళ్ల శాఖ...

జైళ్ల శాఖ సైతం ఏఐని సమకూర్చుకుంటోంది. జైలు రక్షణ, ములాఖతును సరళతరం చేయడం, బంధువులతో ఖైదీ మాట్లాడుకోవడానికి వీడియో కాల్‌, ఆన్‌లైన్‌లో కోర్టు వాయిదాలకు వంటివన్నీ ఇకపై ఏఐ సాయంతో నిర్వహించేందుకు సమాయాత్తమైంది. సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం నిర్వహించిన ఐటీ సమావేశంలో జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్‌ పై అంశాలను వివరించారు. ఏఐతో ప్రతి ఖైదీ వారానికి రెండు సార్లు... మొత్తం పది నిమిషాలు వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశం కల్పించబోతున్నారు. కుటుంబ సభ్యుల నంబర్‌ ఖైదీ చెబితే ఒక రోజు ముందే ఆ నంబర్‌కు ఏఐ సందేశం పంపుతుంది. మీకు జైలు నుంచి వీడియో కాల్‌ వస్తుంది. ఫోన్‌ చార్జింగ్‌, నెట్‌వర్క్‌ సరిగే ఉండేలా చూసుకోవాలని చెబుతుంది.

అలాగే, జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఖైదీలను కోర్టు వాయిదాలకు తీసుకెళ్లాలంటే సిబ్బంది, సెక్యూరిటీ, వాహనం... అదంతా పెద్ద ప్రయాస. ఇకపై వాయిదా రోజు ఏ కోర్టులో హజరు పరచాల్సి ఉందో ఆ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఖైదీని చూపించి పేరు చెబుతారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. సమయం కలిసొస్తుంది.

అధునాతన ఏఐ.. తక్కువ ఖర్చుతో..

అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఏఐని తక్కువ ధరకు సమకూర్చే వారితో ఒప్పందం చేసుకుని మే నుంచి అందుబాటులోకి తెస్తామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. ఈ బాధ్యతలను ఆయన శాంతి భద్రతల ఏఐజీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు అప్పగించారు.

తొలి దశలో 175 స్టేషన్లలో: డీజీపీ

రాష్ట్రంలో 1,019 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో 175 పోలీసు స్టేషన్లలో వచ్చే నెలలో అమలుకు పోలీసు శాఖ చర్యలు మొదలు పెట్టింది. ప్రతి జిల్లాలోనూ 30 నుంచి 35 స్టేషన్లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా 'ఆంధ్రజ్యోతి'కి చెప్పారు. దీనిని దశలవారీగా అన్ని స్టేషన్లకూ విస్తరించనున్నట్టు తెలిపారు.

ఏఐ ఏం చేస్తుంది?

పోలీస్‌ స్టేషన్లలో రైటర్లు ఒక మూసధోరణిలో ఫిర్యాదులను రాయడానికి అలవాటు పడి ఉంటారు. ఆ ఫిర్యాదు చాలా సందర్భాల్లో బాధితునికే అర్థం కాదు. విచారణకు వచ్చే సమయానికి బాధితునికి తన బాధ తప్ప ఫిర్యాదులోని రాత గుర్తుండదు. కొన్ని సందర్భాలలో ఫిర్యాదుదారు చెప్పిన దానికి రైటరు రాసిన దానికీ సంబంధమే ఉండదు. మరికొన్ని సార్లు బాధితుడు రాసిచ్చిన ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ దశకు వచ్చేసరికి మారిపోతుంది. దీనితో కోర్టుల్లో వీగిపోయే కేసుల సంఖ్య పెరుగుతుంది. దీనిని సరిచేసుకోవడానికి ఏఐ చక్కగా ఉపయోగపడుతుందని గ్రహించిన ఏపీ పోలీస్‌... ఆ వైపు అడుగులు వేసింది. ప్రయోగాత్మకంగా ఏలూరు జిల్లాలో 'స్మార్ట్‌ పోలీస్‌ ఏఐ' పేరుతో ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది బాధితులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటుంది. దానిని యథాతథంగా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో... ఎంచుకున్న భాషలో టైప్‌ చేస్తుంది. ఎఫ్‌ఐఆర్‌లో ఏ సెక్షన్లు నమోదు చేయాలో దర్యాప్తు అధికారికి సూచిస్తుంది. ఫిర్యాదుదారు సంతకం చేసి ఇచ్చిన వెంటనే ఏఐ అప్లికేషన్లో కనిపించే సమ్మరీపై క్లిక్‌ చేస్తే చాలు... నేరం జరిగిన చోటుకు వెళ్లి సేకరించాల్సిన ఆధారాలు మొదలుకొని ప్రతిదీ దిశా నిర్దేశం చేస్తుంది. ఫోరెన్సిక్‌ టిప్స్‌, ప్రాసిక్యూషన్‌ టిప్స్‌, ఇన్‌స్ట్రక్షన్స్‌ టూ ఐవో... ఇలా పలు ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉంటాయి. చార్జిషీటు దాఖలులో సహాయపడే ఏఐ ఎక్కడైనా లోపాలున్నా, ఆధారాల సేకరణ సరిగా లేకున్నా అప్రమత్తం చేస్తుంది. ఇంతటితో ఆగిపోకుండా కోర్టులో వినిపించాల్సిన వాదనలు, డిఫెన్స్‌ లాయర్‌ వాదనల్ని ఎదుర్కోవాల్సిన తీరు తెన్నులపైనా మార్గదర్శకత్వం చేస్తుంది. ఫలితంగా శిక్షల శాతం పెరిగి బాధితులకు స్వాంతన లభిస్తుంది. నేరాలు తగ్గుముఖం పడతాయి.

Comments

-Advertisement-