బిగ్ ట్విస్ట్.. ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన అంతా ఉత్తిదే
బిగ్ ట్విస్ట్.. ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన అంతా ఉత్తిదే
ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటనపై పోలీసుల క్లారిటీ..
అత్యాచారమే జరగలేదని కేస్ క్లోజ్ చేసిన పోలీసులు..ఇన్‌స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువతి..
దాన్ని కప్పిపుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టుకథ..
250 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు..
100 మంది అనుమానితులను విచారించిన పోలీసులు..
ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం..
చివరికి పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న యువతి..
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రంలో (సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగిదంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే యువతి పోలీసులు తప్పుదోవ పట్టించినట్లు బయటపడింది. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఈకేసును పోలీసులు మూసివేశారు. అయితే అసలు ఏం జరిగిందో తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ పోలీసులను యువతి ఎలా తప్పుదోవ పట్టించింది.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటి యువతకు రీల్స్ పిచ్చి అధికం. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ కోసం తెగ ఆరాటపడుతుంటారు. ఒక్కో సారి రీల్స్ చేస్తూ ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టేస్తారు. ఆ కోవకు చెందిందే ఈ యువతి కూడా. సదరు యువతి ఎంఎంటీఎస్ రైళ్లో రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడింది యువతి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇంట్లో తెలిస్తే మందలిస్తారనమే భయంతో తాను చేసిన పనిని కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది ఆమె. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసింది. అదే విషయాన్ని పోలీసులను చెప్పి.. వారిని కూడా బురిడీకొట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులకు అనుమానం రాకుండా సక్సెస్‌ఫుల్‌గా తప్పుదోవ పట్టించింది కూడా.
అయితే ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచార ఘటనను మాత్రం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. నిందితుడి కోసం తీవ్రంగా శ్రమించారు కూడా . ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. దాదాపు 250 సీసీ కెమెరాలను జల్లెడపట్టారు పోలీసులు. 100 మందికిపైగా అనుమానితులను ప్రశ్నించారు. కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో తీవ్ర గందరగోళంలో ఉండిపోయారు. చివరకు అనుమానం వచ్చిన పోలీసులు యువతిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. అసలు నిజం బయటకు వచ్చింది. అసలు తనపై అత్యాచారం జరగలేదని.. రీల్స్ చేస్తూ ట్రైన్‌లో నుంచి కింద పడినట్లు పోలీసుల ఎదుట నిజం ఒప్పుకుంది యువతి. దీంతో పోలీసులు యువతిని తీవ్రంగా మందలించినట్లు తెలిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు మరోసారి చేయొద్దని హెచ్చరించినట్లు సమాచారం. అయితే జరగని అత్యాచారాన్ని జరిగిందంటూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువతిపై.. ఇదేం పని అంటూ ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. అనంతపురం జిల్లాలోకు చెందిన ఓ యువతి స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. మార్చి 22న సెల్‌ఫోర్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన యువతి తిరిగి రాత్రి సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఎక్కింది. ఇక్కడ కట్ చేస్తే.. అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఎంఎంటీఎస్ రైలులలో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడని.. దీంతో భయంతో కదులుతున్న రైలులో నుంచి బయటకు దూకినట్లు చెప్పుకొచ్చింది. యువతి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు కూడా. ఎన్నో సీసీ టీవీ ఫుటేజ్‌లు కూడా పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరకు యువతిని ప్రశ్నించగా.. తనపై అత్యాచారం జరగలేదని, రీల్స్ చేస్తూ కిందపడ్డాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది యువతి..