జబ్బులు మన ఆహ్వానం లేకుండా రావు
జబ్బులు మన ఆహ్వానం లేకుండా రావు
సరైన ఆహారాన్ని తినండి-సరిగా జీవించండి
కాలేయ వ్యాధుల్ని అరికట్టండిః మంత్రి సత్యకుమార్ యాదవ్
సాధారణంగా వ్యాధులు మన ఆహ్వానం లేకుండా రావని, సరైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా జబ్బుల్ని అరికట్టవచ్చని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏప్రిల్ 19 ని "ప్రపంచ కాలేయ దినం" (World Liver Day) జరుపుకుంటున్న సందర్భంగా 'X ' వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సరైన జీవన విధానంలో కాలేయ వ్యాధుల్ని అరికట్టడానికి సరైన ఆహారం, జీవన అలవాట్లను అనుసరించాలని పిలుపునిచ్చారు.
'ఆహారమే మందు' అనే ఇతివృత్తంతో...ప్రజల్లో సరైన పోషకాలతో కూడిన ఆహారం ద్వారా కాలేయ వ్యాధుల్ని అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి ఈ ప్రపంచ కాలేయ దినాన్ని జరపటానికి ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు
అనారోగ్యకర ఆహారం, ఊబకాయం, మద్యపానం, మధుమేహం, అపరిశుభ్రత, అనియంత్రిత సెక్స్, శరీరంపై టాటూలు వేయించుకోవడం, వాడిన సిరంజీలను తిరిగి వాడడం, హెపటైటిస్ నిరోదక టీకాలు వేయించుకోకపోవడం వల్ల కాలేయ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు
జీర్ణ ప్రక్రియ, శరీరంలోని వ్యర్ధ పదార్ధాల్ని తొలగించడం, రక్త ప్రసరణ సవ్యంగా జరగడంలో కాలేయం ప్రముఖ పాత్ర వహిస్తుందని, కనుక ప్రజలు ఆహార, జీవన అలవాట్లపై తగు శ్రద్ద వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జీవన ప్రక్రియకు అవసరమైన వందలాది రసాయనాల్ని తయారు చేసే కాలేయం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు
38 శాతం ప్రజల్లో ఫ్యాటీ లివర్ ( కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం) పై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలేయం ప్రాధాన్యత దృష్ట్యా సరైన "ఆహారం-సరైన జీవన శైలి" అవలంబించడానికి ప్రపంచ కాలేయ దినం సందర్భంగా ప్రజలు దీక్షబూని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు