తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోండి
తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోండి
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుండి తాగునీటి సరఫరాకు సంబంధించిన వేసవి కార్యాచరణ ప్రణాళిక,స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3వేల 438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్ల రూ.లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు,వేడి గాలులు వీచే అవకాశం ఉందని కావున వేడి గాలుల పరిస్థితులను అధికమించేందుకు తగిన సంసిద్ధత ముందు జాగ్రత్త కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సిఎస్ సూచించారు.
కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్రైవేట్ తాగునీటి వనరులను అద్దెప్రాతిపదిక తీసుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని ఆదేశించారు.అంతేగాక తాత్కాలిక నీటి సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ,మరమ్మత్తులు,తాగునీటి చెరువులను నీటితో నింపడం,చేతి పంపులకు మరమ్మత్తులు నిర్వహించడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర,జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో వాటిపై స్పందించి తక్షణం పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు.అదే విధంగా తాగునీటికి సంబంధించి పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్(పిజిఆర్ఎస్),వివిధ ప్రసార మాద్యమాలు,కరువు మానిటరింగ్ సెల్,కాంటాక్ట్ సెంటర్ టోల్-ఫ్రీ నంబర్ -1902 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించి వాటిని సకాలంలో పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు.
అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోను ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని జలవనరుల శాఖతో సమన్వంయం చేసుకుని కాలువలకు అడ్డుకట్ట వేసి చెరుకువులకు నీటిని మల్ళించి వాటిని పూర్తిగా నీటితో నింపాలని అన్నారు.భూగర్భ జల ఆధారిత ప్రాంతాల్లో బోర్ బావులను ఫ్లష్ చేయడం,లోతు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.చేతి పంపులు,పవర్ బోర్ లకు తక్షణ మరమ్మత్తులు నిర్వహించి అవి సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని చెప్పారు.ఇదే సమయంలో అన్నిమంచినీటి పంపిణీ లైన్లు,పంపింగ్ మెయిన్‌లను పూర్తిగా తనిఖీ చేసి నీటి లీకేజీలను అరికట్టాలని,విద్యుత్ అంతరాయం కలిగితే నీటి సరఫరాలో ఆటంకం కలగకుండా స్టాండ్ పై జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తాగునీటికి ఇబ్బంది గల ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. తాగునీటి పొదుపుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు.ప్రతి పట్టణ స్థానిక సంస్థలోను తాగునీటికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా ఫిర్యాదుల సెల్ ను ఏర్పాటు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.అంతేగాక ధాతలు,ఇతర సంస్థల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.నీటి కాలుష్యం వల్ల వ్యాధులు ప్రభల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.
అనంతరం స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఆయన సమీక్షిస్తూ ప్రతినెలా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా కార్యాలయాలు,పరిసరాలన్నిటినీ పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ చెప్పారు.ముఖ్యంగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్ధాల(ఇ-వేస్ట్)సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని దీనిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలని సూచించారు.ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ-వ్యర్థాల సేకరణపై శిక్షణ ఇవ్వాలని తద్వారా ఈ-వ్యర్థాలను అన్ని విభాగాలలో గుర్తించి వాటిని సక్రమంగా పారవేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారానికి ఒకసారి ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాలల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్‌పై సాంకేతిక సహకారాన్ని అందించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తగిన తోడ్పాటును అందిస్తారని తెలిపారు.ఈ-వ్యర్ధాలను ఎక్కడిపడితే అక్కడ పారవేయడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పోస్టర్లు, కరపత్రాలు,ప్రకటనలు,సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేసి ప్రజలకు అవగాహన కలిగించాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.
ఈవీడియో సమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా,ఎండి ఎపిఐఐసి,పరిశ్రమల శాఖ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి పాల్గొనగా వర్చువల్ గా వివిధ జిల్లాల కలక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.