అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూ మహిళలు, చిన్నారుల రక్షణే 'శక్తి' బృందాల ప్రథమ కర్తవ్యం
అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూ మహిళలు, చిన్నారుల రక్షణే 'శక్తి' బృందాల ప్రథమ కర్తవ్యం
✅ శక్తి టీములను జెండా ఊపి ప్రారంభించి విధులపై దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ
కడప, ఏప్రిల్ 16 (పీపుల్స్ మోటివేషన్): మహిళలు,చిన్నారుల భద్రతే లక్ష్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్, వారు వినియోగించనున్న 56 ద్విచక్ర వాహనాలను జిల్లా ఎస్పి ఇ.జి అశోక్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయం లోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ తో జిల్లా ఎస్పి మమేకమై, వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలను సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి దాడులు,అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకుగాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 'శక్తి టీమ్స్' ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, రద్దీ ప్రదేశాలు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడళ్లలో నిఘా ఉంచాలన్నారు. ఈ శక్తి టీమ్స్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా విధులు నిర్వహించి నేరాల శాతాన్ని తగ్గించాలని, మహిళలపై వేధింపులు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులను చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళలకు, చిన్నారులకు ఆపదలో మేమున్నామంటూ ఓ వైపు ధైర్యాన్నిస్తూ..అరాచక శక్తుల ఆట కట్టించాలన్నారు. మహిళా వివక్ష, హింస, లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదన్నారు. నేరాల కు అడ్డుకట్ట వేసేలా ప్రభావంతంగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన 7 బృందాలు: జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రెండు బృందాలు, కడప సబ్ డివిజన్ -1, మైదుకూరు -1, ప్రొద్దుటూరు -1, పులివెందుల -1 , జమ్మలమడుగు -1 చొప్పున సబ్ డివిజన్లలో విధులు నిర్వర్తిస్తాయన్నారు. ఈ టీమ్స్ లో ఎస్సై నేతృత్వంలో ఇద్దరు మహిళా సిబ్బంది, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారన్నారు. కడప సబ్ డివిజన్ కు 17, మైదుకూరు సబ్ డివిజన్ కు 15, ప్రొద్దుటూరు సబ్ డివిజన్ కు 8, జమ్మలమడుగు సబ్ డివిజన్ కు 9 , పులివెందుల సబ్ డివిజన్ కు 7 వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు. శక్తి టీమ్ లోని సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆపద సమయంలో శక్తి యాప్ నకు వచ్చే ఎస్.ఓ.ఎస్.కాల్స్, డయల్ 112/100 , 181, 1098, 1930 కాల్స్ తో సంఘటన స్థలంకు ఈ టీమ్స్ వెళ్తాయన్నారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు తక్షణమే అప్రమత్తమై వేగవంతంగా సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యలను పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టుబడ్డ అసాంఘిక శక్తులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి తదుపరి చర్యలకై అప్పగించాలన్నారు.
మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేలా శక్తి టీములకు జిల్లా ఎస్పి పలు సూచనలు చేశారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించేలా టీమ్స్ కృషిచేయాలన్నారు.
శక్తి యాప్ పనిచేసే విధానం:
ఒన్ టచ్ SOS బటన్- వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. * Shake Trigger/Hand Gesture SoS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లొకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది తద్వారా పోలీసు అధికారులు తక్షణమే స్పందించి వేగవంతంగా చర్యలు తీసుకుంటారు.
*ముఖ్యమైన ఫీచర్లు*: ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్టు చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్టు చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్... లాంటి ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ “శక్తి" యాప్ లో పొందుపరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి ఎస్.రమాకాంత్, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాసరావు, ఆర్.ఐ లు వీరేష్, ఆనంద్, మహిళా పి.ఎస్ ఇన్స్పెక్టర్ ఎల్లమరాజు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, ఇ.సి మెంబర్ మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు.