Rajiv Yuva Vikasam: సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యల, వరుస సెలవులు దరఖాస్తు గడువు పెంచాలి
Rajiv Yuva Vikasam: సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యల, వరుస సెలవులు దరఖాస్తు గడువు పెంచాలి
• సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం..
• ఇంటర్నెట్, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారుల పడిగాపులు..
• ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు..
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, సాంకేతిక సమస్యల కారణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం ఫారం డౌన్‌లోడ్ కావడానికి సైతం అధిక సమయం పడుతోంది. దీంతో దరఖాస్తుదారులు పదే పదే మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14న ముగియనుంది.
భారీగా దరఖాస్తు చేస్తులూ..
6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసే అవకాశం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పథకంపై ఆశలు పెట్టుకుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దారు ఆఫీసుల్లో ఆరు లక్షలకుపైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయవు. దీంతో ఈ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ యువత ఈ పథకానికి 14 లక్షల మందికి పైగా ఈ పథకానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. 10 రోజుల తర్వాత అంటే మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది.
రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవులు ఎక్కువగా వచ్చాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి రోజుల్లో రెవెన్యూ ఆఫీసులు పనిచేయలేదు. ప్రభుత్వం ఈ నెల 14ను గడువుగా ప్రకటించగా. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ప్రభుత్వ ఆఫీసులు పనిచేయడంలేదు. ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వస్తోందని యువత పేర్కొంటున్నారు. దీంతో నిరుద్యోగ యువత ప్రభుత్వానికి గడువు పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నట్లు సమాచారం. స్వంత వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించనుంది.