Simhadri Appanna Swamy: సింహాద్రి చందనోత్సవంలో ప్రమాదం .. 8 మంది భక్తులు మృతి
Simhadri Appanna Swamy: సింహాద్రి చందనోత్సవంలో ప్రమాదం.. 8 మంది భక్తులు మృతి
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి
రూ.300 టికెట్ కౌంటర్ వద్ద కూలిన సిమెంట్ గోడ
8 మంది భక్తులు మృతి, నలుగురికి గాయాలు
సహాయక చర్యలు నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంటు గోడ కూలిపోయింది.
వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింహాచలం దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతిచెందడం కలచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల గోడ కూలడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయచర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం ఉప ముఖ్యమంత్రి
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. క్యూలైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. చందనోత్సవ సమయాన దుర్ఘటన దురదృష్టకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖ జిల్లా అధికారుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు. భారీ వర్షాల వల్ల గోడ కూలిందని అధికారులు తెలిపారని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
సింహాచలం ప్రమాదంపై మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆనం ఆదేశించారు. సింహాచలంలో 8 మంది భక్తుల మృతిపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.