ఏపీలో అద్భుతం - 10రోజులపాటు మిట్ట మధ్యాహ్నం కొద్దిసేపు మీ నీడ మాయం
ఏపీలో అద్భుతం - 10రోజులపాటు మిట్ట మధ్యాహ్నం కొద్దిసేపు మీ నీడ మాయం
ఖగోళ అద్భుతం వల్ల మిట్ట మధ్యాహ్నం నీడ రెండు నిమిషాల పాటు మాయం - ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు
ఖగోళ అద్భుతం వల్ల ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్‌సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క కనిపిస్తుందని కాని ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు మాత్రం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని సుసత్యరేఖ వివరించారు.
సూర్యుని స్థానం మారుతూ :
భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉన్నందున సూర్యుడి చుట్టూ భ్రమణం చేసే సమయంలో సూర్యుని స్థానం ఉత్తర - దక్షిణ దిశల్లో మారుతూ ఉంటుందని సుసత్యరేఖ వెల్లడించారు. ఏటా రెండు సందర్భాల్లో కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయాల్లో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయని చెప్పారు. దీనివల్ల నిలువు వస్తువుల నీడ రెండు నిమిషాల వరకు పూర్తిగా మాయమవుతుందని వివరించారు. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని కదలిక, స్థానాన్ని అధ్యయనం చేసేందుకు జీరోషాడో ఎంతగానో ఉపకరిస్తుందని సుసత్యరేఖ తెలిపారు.