సీఎం పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
సీఎం పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం, మే 06 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం వద్ద హెలిప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను, గ్రామసభ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ వద్ద త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనంతపురం ఆర్డీవో, ఆర్.అండ్.బి ఎస్ఈలను ఆదేశించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ బ్రిడ్జి వద్ద అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈకి సూచించారు. గ్రామసభ ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకోవాలని గుంతకల్ ఆర్డీవోని ఆదేశించారు. డిపిఓ, మున్సిపల్ కమిషనర్ లు శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమం సందర్భంగా తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం ఆయా శాఖల అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కేశవ నాయుడు, శ్రీనివాస్, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా పరిషత్ సీఈవో రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్.అండ్.బి ఎస్ఈ రాజగోపాల్, డిఎల్డివోలు లలితా బాయి, విజయలక్ష్మి, హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.