సర్వజనాసుపత్రిని 1200 పడకులకు విస్తరిస్తాం
సర్వజనాసుపత్రిని 1200 పడకులకు విస్తరిస్తాం
- సర్వజనాసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం
- ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి
- సప్తగిరి క్యాంపర్ సేవా కార్యక్రమాలను అభినందించిన ఎమ్మెల్యే
- స్వచ్ఛంద సంస్థల సహకారం చాలా అవసరమన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా త్వరలో విస్తరిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని జేఎన్టీయూ రోడ్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సప్తగిరి క్యాంపర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఎం.ఓ డాక్టర్ హేమలత, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ప్రభుత్వాసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యాధికారులు, సప్తగిరి క్యాంపర్ ప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ సప్తగిరి క్యాంపర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇప్పటికే సర్వజనాసుపత్రితో పాటు సిడి హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలలో 25 లక్షలతో ఆర్.ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీల్ చైర్లు, ఫ్యాన్లు, కూలర్లు తదితర వాటిని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాటిని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మరోవైపు అనంతపురం సర్వజనాసుపత్రిలో అవసరమైన భవనాల నిర్మాణానికి 38 కోట్ల తో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైద్య ఆరోగ్యశాఖ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివరించారు.
అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సన్మానించారు.