ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తులకు రూ.344 కోట్లు
ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తులకు రూ.344 కోట్లు
• 10 లక్షల లోపు పనులు సాగునీటి సంఘాలు చేపట్టవచ్చు.
• మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి.
• ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల.
ఈనెలాఖరు నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 344 కోట్లు విడదల చేశారని, ఆనిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులు వెంటనే మొదలుపెట్టాలని అన్నారు. ఓ అండ్ ఎం పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ అండ్ ఎం పనుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయటం ముదావహమన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందు అంటే, నేటి నుంచి కేవలం పది పన్నెండు రోజులు మాత్రమే ఉన్నందున తక్షణం పనులను ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉందని మంత్రి సూచించారు. ఇందుకు సూపరిండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణ చేయటం ద్వారానే సకాలంలో పూర్తి కాగలవన్నారు.
10 లక్షలు దాటిన పనులకు ఏడు రోజుల గడువులో పూర్తి చేసే విధంగా షార్ట్ టెండర్లు పిలవాలని సూచించారు. రూ 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని రామానాయుడు తెలిపారు. ఆ రకంగా ఎక్కడికి అక్కడ సాగునీటి సంఘాలను చైతన్య పరచడం ద్వారా పనులు త్వరితగతిని పూర్తయ్యేలా చైతన్య పరచాలని ఇరిగేషన్ అధికారులకు,ఎమ్మెల్యేలకు సలహా ఇచ్చారు.
గత ప్రభుత్వం ఓ అండ్ ఎం పనులను గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. కాలవల్లో తట్ట మట్టి తీయలేదు అన్నారు. కనీస మరమ్మతులైన షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయడం మరిచిందన్నారు. కనీసం గ్రీజు కూడా పెట్టలేదు అన్నారు.
గతంలో వందలు, వేల కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు డ్రైన్స్ నిర్మిస్తే, 2019లో వచ్చిన ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో కనీస మెయింటెనెన్స్ చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. ఫలితంగా ఆ పనులన్నీ పాడు పడే పోయే విధంగా తయారయ్యాయి అని అన్నారు.
గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. టెలికాన్ఫెరెన్స్లో పలు జిల్లాల ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.