ఇది మామూలు విధ్వంసం కాదు.. ఒకేసారి 50 బుల్డోజర్లతో.. ఒక్కరోజులోనే 8500 ఇండ్లు నేలమట్టం..!!
ఇది మామూలు విధ్వంసం కాదు.. ఒకేసారి 50 బుల్డోజర్లతో.. ఒక్కరోజులోనే 8500 ఇండ్లు నేలమట్టం..!!
ఆక్రమణలపై హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఎలా ఉంటుందో.. అంతకు మించిన యాక్షన్ గుజరాత్ లో జరిగింది. ఒకేసారి 50 బుల్డోజర్లు.. వరుసగా.. క్యూలో వెళ్తుంటే..
యుద్ధ ట్యాంకులు దూసుకొచ్చిన దృశ్యాన్ని తలపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 బుల్డోజర్లు దండయాత్రకు బయలుదేరినట్లుగా వెళ్లి ఆక్రమణలను కూల్చేయడం సంచలనంగా మారింది.
గుజరాత్ లోని చందోలా సరస్సును ఆక్రమించి కట్టిన అక్రమనిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. ఒకే రోజు 8 వేల 500 ఇండ్లను నేలమట్టం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేసి మొత్తం 2 లక్షల 50 వేల చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకేరోజు ఇన్ని ఇండ్లు కూల్చివేయడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్.
చందోలా సరస్సు ఆక్రమణలపై రెండో దశ కూల్చివేతలు సోమవారం (మే 19) ప్రారంభమయ్యాయని.. మంగళవారం 50 యాభై బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేసినట్లు అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ జైపాల్ సింగ్ రాథోడ్ తెలిపారు. దాదాపు 99.9 శాతం ఆక్రమణలను కూల్చివేసినట్లు ఈ సందర్బంగా చెప్పారు. అక్కడ కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆదేనుసారం కూల్చివేతలు జరిపామని.. దీనిపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.
పహల్గాం ఘటన తర్వాత స్పీడ్ పెంచిన గుజరాత్ ప్రభుత్వం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన వలసదారులను భారీ సంఖ్యలో పట్టుకుంది అక్కడి గుజరాత్ ప్రభుత్వం. ఏప్రిల్ 29, 30 తేదీలలో ఫస్ట్ ఫేస్ లో భాగంగా చాలా వరకు అక్రమనిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో కూల్చి వేశారు. రెండో దశలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు 50 టీమ్స్ గా ఏర్పడి.. 7 జోన్లుగా విడిపోయి.. యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కూల్చివేతలు సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 350 మంది స్టాఫ్ ఈ భారీ యాక్షన్ ప్లాన్ లో పాల్గొన్నారు. భద్రత కోసం 3 వేల మంది పోలీసులను మోహరించి కూల్చివేతలు జరిపారు.
మొదటి దశలో మొత్తం 210 అక్రమ వలసదారులను పట్టుకున్న అహ్మదాబాద్ పోలీసులు.. రెండవ దశలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు. ఇల్లీగల్ నిర్మాణాల కూల్చివేతల వరకు బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
అయితే 2010 కి ముందు నుంచి నివసిస్తున్న ప్రజలకు వసతి కల్పిస్తామని.. ఆ తర్వాత వచ్చిన వారు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం.