సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
- జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ
- సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
- కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మే 21 :
జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయా శాఖల అధికారులు దృష్టికి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించగా, సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, టిటిడి బోర్డు సభ్యులు మరియు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జడ్పి సిఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఈఓ రామసుబ్బయ్య, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, ఉమ్మడి అనంత జిల్లాలలో సమస్యలను జడ్పిటిసిలు, ఎంపీపీలు ఆయా శాఖల అధికారులకు లికిత పూర్వకంగా అందజేయాలని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ లో పలు మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమస్యల పరిష్కరించిన తర్వాత సభ్యులకు తగిన సమాచారం అందించాలనన్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జడ్పీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో రాత్రిపూట కూడా తనిఖీలు చేయాలని, రాత్రిపూట డ్యూటీ వేసిన వారు ఎమర్జెన్సీలో ఉన్నారా లేదా అనేది తనిఖీలు చేయాలని ఆసుపత్రిని మరింత బలోపేతం చేయాలని జిజిహెచ్ సూపరింటెండెంట్ ని ఆదేశించారు. పలు పీహెచ్సీలలో ఆయా పడకలకు సరిపడాకంటే ఎక్కువమంది వస్తున్నారని, డ్రగ్స్ బడ్జెట్ కోసం స్పెషల్ సెక్రటరీకి లేఖ రాశామని, పీహెచ్సిలలో ఖాళీల గురించి ప్రతిపాదనలు పంపించామని, రాబోయే రోజుల్లో సేవలను మరింత మెరుగు పరుస్తామన్నారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో తాము పర్యటించామని, వజ్రకరూరు పిహెచ్సిలో డాక్టర్లు ఉన్నారా లేదా అనేది చూడాలని, లేకపోతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిసిహెచ్ఎస్ ని ఆదేశించారు. శెట్టూరు పిహెచ్సిని తనిఖీ చేసి డాక్టర్లు ఎందుకు అందుబాటులో ఉండడం లేదో రెండు వారాలలోపు నివేదిక అందించాలని డిఎంహెచ్ఓని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందని, సీఎం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారని, జిల్లా పర్యటనలో రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా ఈ విషయమై ప్రజా ప్రతినిధులు తీసుకురావడం జరిగిందని, కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ఆసుపత్రులకు హెచ్డిఎస్ నిధులు ఇచ్చామన్నారు.గ్రూప్ 4 ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ఆసుపత్రులలో నర్సులు, టెక్నీషియన్లు నియామకానికి నోటిఫికేషన్ జారీచేశామన్నారు. రెండు వారాల్లో వీటిని పూర్తి చేస్తామన్నారు.పిహెచ్సి, సిహెచ్సి తనిఖీలకు సంబంధించిన ప్రొఫార్మాను తయారు చేయాలని డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ లను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లోని పిహెచ్సి, సిహెచ్సిలను వికేంద్రీకరణ చేశామని,నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారానికి ఒక పిహెచ్సి, సిహెచ్సిలను తనిఖీ చేసేలా చూడాలన్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా జిల్లా యూనిట్ గా డి ఎం హెచ్ ఓ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న గైనకాలజిస్ట్ లు, చిన్నపిల్లల స్పెషలిస్టులు ఎవరైనా ఉంటే తెలియజేయాలని, వాకిన్ ఇంటర్వ్యూలు చేసి వారిని నియమిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేయకపోయినా డబ్బులు తీసుకోవడంపై ఏపిడిలను నియమించి తప్పులు జరిగితే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని డ్వామా పిడి ని ఆదేశించారు. త్వరలో రెవెన్యూ ప్రమోషన్లు జరుగుతాయని, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు ఇస్తామని, ఆయాచోట్ల ఖాళీల సమస్య పరిష్కరిస్తామన్నారు. చుక్కల భూములకు సంబంధించి ప్రతి శుక్రవారం జాబితాపై సమావేశం పెట్టి దరఖాస్తులను పరిష్కారం చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి వివరాలను తెలియజేయాలని, అట్టి వారి భూములను చుక్కలభూమినుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చుక్కల భూములు సాగు చేసుకుంటున్న వారి అడంగల్ చూపించి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని అధికారులు బ్యాంకులకు చెప్పాలని, ఈ విషయమై బ్యాంకులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తామన్నారు. చెరువుల కింద ,లోతట్టు ప్రాంతాల్లో, కాలువలు, వంకలలో అక్రమంగా ఇల్లు కట్టుకుని ఉన్న వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై వారికి నోటీసులు కూడా ఇది వరకే జారీ చేశామని, నీళ్లు రాకమునుపే లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మరొకమారు విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చిన ఆయా మండలాల ఏఈలకు ప్రోటోకాల్ గురించి వివరించాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సభ్యులు తీసుకువచ్చిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ.. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో రోజుకు 2 వేలు వరకు తక్కువ కాకుండా ఓపిలు చూడడం జరుగుతోందని, తాము హాస్పిటల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టామని, గత నాలుగైదు నెలల నుంచి ఆస్పత్రి గాడిలో పడిందన్నారు. జిజిహెచ్ కు వచ్చిన ప్రతి రోగికి తగిన చికిత్స అందించి పంపిస్తున్నారన్నారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ శెట్టూరు పీహెచ్సీలో డాక్టర్లు లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, పేదవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ఐదు ఏళ్లలో ఎలాంటి రోడ్లు వేయలేదన్నారు. 50 ఏళ్ల నుంచి జిల్లాకు, కళ్యాణదుర్గంలో హాస్పిటల్ ద్వారా సేవలు చేస్తున్న ఆర్డిటి సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ కి సంబంధించిన సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో కలిసి తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నామని, ఈ విషయమై 2024 లో ఆగస్టులో కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశామని, ఆయన తిరిగి సమాధానం కూడా ఇచ్చారన్నారు. ఆర్డిటిని అందరం కలిసికట్టుగా కాపాడుకుందామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ చుక్కల భూముల విషయమై అత్యవసరమైన, స్పష్టమైన కేసులకు సంబంధించి రైతుల వివరాలు అందించాలని, దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో తెప్పించుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జెడ్పి డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ మండలంలోని పిహెచ్సిలో స్కానింగ్ మిషన్ నిరుపయోగంగా ఉందని, స్కానింగ్ మిషన్ ఆపరేటర్ ను ఏర్పాటు చేయాలని, గర్భవతులకు స్కానింగ్ చేయించేలా చూడాలని, 55 వేల జనాభా ఉన్న మండలంలో ఆసుపత్రిని 30 పడకలకి పెంచాలని,24 గంటల పాటు డ్యూటీ డాక్టర్లను ఏర్పాటు చేయాలని, నగరంలోని జిజిహెచ్ లో శుభ్రత పాటించేలా చూడాలని, జెడ్పీ షాపులు నిరుపయోగంగా ఉన్నాయని, జడ్పీలో సబ్యులకు కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు నిరుపయోగంగా ఉందని వాటినిఅవసరమైన మరమ్మతులు చేయించి సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వజ్రకరూరు ఎంపీపీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రి కట్టించామని, డాక్టర్లను, నర్సులను ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో నిర్వహించే సమావేశాలకు విద్యుత్ ఏఈ రావడం లేదన్నారు. శెట్టూరు జడ్పిటిసి మాట్లాడుతూ మండలంలోని పీహెచ్సీలో తగిన సిబ్బంది లేరన్నారు. ఆత్మకూరు జెడ్పిటిసి మాట్లాడుతూ పిహెచ్సిలో స్వీపర్ లేరని, రోగులకు మందులు అందడం లేదని, సమస్యలు పరిష్కరించాలని అంబులెన్స్లను పనిచేసేలా చూడాలన్నారు. జడ్పిటిసి మాట్లాడుతూ పశువుల షెడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎమ్మెల్యే చెప్పాలని అధికారి నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారన్నారు. అనంతపురం రూరల్ జెడ్పిటిసి మాట్లాడుతూ ఉపాధి పనులలో అవకతవకలు చేస్తున్నారని, కక్కలపల్లి, చియ్యేడు, కామారుపల్లి, తదితర గ్రామాల్లో పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు 20 మంది కూలీలు పనులకు వచ్చినా 60 మంది వచ్చినట్లు రాస్తున్నారన్నారు. నల్లమడ జడ్పిటిసి మాట్లాడుతూ 2014 నుంచి చుక్కల భూముల దరఖాస్తుల పెండింగ్ ఉన్నాయని,వాటిని తొలగించాలన్నారు. రొళ్ల జడ్పిటిసి మాట్లాడుతూ మండలంలో రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేశారని, సీనియారిటీ లేకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని, సీనియార్టీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేలా చూడాలన్నారు. కళ్యాణదుర్గం ఎంపిపి మాట్లాడుతూ ఎంపీపీ కార్యాలయానికి తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ఇలా పలువురు ఎంపీటీసీ, జడ్పిటిసిలు తమ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయా శాఖల జిల్లా అధికారులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.