విశాఖలో 5లక్షల మందితో యోగాసనాలు ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యం:సిఎస్
విశాఖలో 5లక్షల మందితో యోగాసనాలు ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యం:సిఎస్
అమరావతి,30 మే:జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి సమక్షంలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 5లక్షల మంది ద్వారా యోగాసనాలు వేయించడం ద్వారా సమీప భవిష్యత్తులో ఎవరూ ఆ రికార్డును అధికమించని విధంగా గిన్నిస్ రికార్డును సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో యోగాంధ్ర-2025పై ఆయన పలు శాఖల కార్యదర్శులతో 11వ అంతర్జాతీయ యోగా ఏర్పాట్లపై సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కనీసం 2కోట్ల మంది అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా విశాఖపట్నం రామకృష్ణా బీచ్ నుండి భీమిలి వరకూ సుమారు 26 కిలోమీటర్ల పొడవున నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 5లక్షల మంది పాల్గొని ప్రపంచ గిన్నిస్ రికార్డును సాధించి సమీప భవిత్తులో ఏవరూ ఆరికార్డును అధికమించని రీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని పలు శాఖల కార్యదర్శులకు సిఎస్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణపై జూన్ 3వ తేదీన మంత్రుల బృందం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించనున్నందున వివిధ టాస్క్ లు కేటాయించిన అధికారులు,కార్యదర్శులు 2వ తేదికి ప్రాధమిక నివేదికలు సమర్పించాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబును నోడలు అధికారిగా నియమించగా ఆయన జూన్ 16వ తేదీ నుండి విశాఖ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నుండి పూర్తిగా పనిచేస్తారని అన్నారు.జిల్లాకు ఒక నోడలు అధికారని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగేలా కలక్టర్లు చూడాలని ఆదేశించారు.ప్రధాన ఈవెంట్ విశాఖపట్నంలో జరగనున్ననేపధ్యంలో విశాఖను సర్వాంగ సుందరంగా తీర్దిదిద్దాలని జిల్లా కలక్టర్ సహా పలు శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.విశాఖ నగరంతోపాటు విశాఖ సమీప జిల్లాలైన అనకాపల్లి,ఎఎస్ఆర్,విజయ నగరం,శ్రీకాకుళం జిల్లాల నుండి ప్రజలు అధిక సంఖ్యలోను,మిగతా జిల్లాల నుండి వివిధ వర్గాల ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని కలక్టర్లకు సూచించారు.ప్రజల తరలింపు వారి భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తోపాటు పార్కింగ్ తదితర అంశాలల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు పనులు కేటాయిస్తూ జిఓ జారీ చేయడం జరిగిందని ఆప్రకారం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ రాష్ట్ర నోడలు అధికారి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించి వివిధ అధికారులకు కేటాయించిన విధులను వివరిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక వెబ్ పోర్టల్ ను ప్రారంభించగా పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా వరసగా మూడు రోజులు పాటు యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారి వివరాలను మదింపు చేసి సుమారు 20 లక్షల మందికి యోగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.విశాఖలో జరిగే ప్రధాన ఈవెంట్ కు ప్రతి 500 మీటర్లకు ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.అలాగే 150 మీటర్ల దూరానికి ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు.కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 5లక్షలకు పైగా టి.షర్టులు,యోగా మాట్ లను సమకూర్చనుండగా మిగతా అవసరమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రతి 1000 మందికి ఒక ప్రత్యేక ఎనక్లోజర్ చిన్నవేదిక ఏర్పాటు చేసి యోగా శిక్షకులచే యోగాసనాలు వేయించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈసమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న డిజిపి హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ విశాఖలో ప్రధాన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుబంధంగా నాలుగైదు కిలోమీటర్లకు ఒకటి సబ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు.రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి పోలీస్,రెవెన్యూ తదితర అధికారులతో కలిసి ఎఐ టూల్స్,సిసిటివి కెమెరాలు,డ్రోన్ల ద్వారా విశాఖ ప్రధాన వేదిక ప్రాంతాన్నిపరిశీలించి ఒక ప్రాధమిక అంచనా వేస్తామని చెప్పారు.
విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశాఖ ప్రధాన వేదిక ప్రాంతంలో చేపట్టనున్న ఏర్పాట్లను విరించారు.ప్రధాన మంత్రి పాల్గొనే ఆర్కె బీచ్ ప్రధాన వేదిక వద్ద సుమారు 15వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవేళ వర్షం వస్తే కంటిన్జెన్సీ ప్రణాళికలో భాగంగా ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15వేల మందితో యోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.ఇది కాకుండా ఆర్కె బీచ్ నుండి భీమిలి వరకూ 350కు పైగా కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రతి కంపార్టుమెంట్లో కనీసం 500 నుండి 1000 మందికి పైగా యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
ఈసమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ వీరపాండ్యన్,ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, ఐఅండ్పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తదితర అధికార్లు పాల్గొన్నారు.అదే విధంగా మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,రవాణా శాఖ కమీషనర్ మనీష్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఇతర కార్యదర్శులు,శాఖాధిపతులు అనకాపల్లి,ఎఎస్ఆర్, విజయనగరం,శ్రీకాకుళం జిల్లా కలక్టర్లు,ఇతర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.