Bay Leaves: బిర్యానీ లో వాడే ఆకుల ప్రయోజనాలు తెలుసా
Bay Leaves: బిర్యానీ లో వాడే ఆకుల ప్రయోజనాలు తెలుసా
Bay Leaves: బిర్యానీ లేదా మసాలా వంటకాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ వంటకాలను తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ వంటల్లో బిర్యానీ ఆకులను వేస్తారు. అందువల్లే ఆయా వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. బిర్యానీ ఆకులు కేవలం రుచి, వాసనను అందించడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తాయి. ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలోనూ ఈ ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులనే తేజ్ పత్తా అని కూడా పిలుస్తారు. ఈ చెట్లను మన ఇంటి పెరట్లో లేదా ఇంటి ముందు కూడా పెంచుకోవచ్చు. బిర్యానీ ఆకులతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పలు అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
జీర్ణ సమస్యలకు చెక్..
బిర్యానీ ఆకును ఒకదాన్ని తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీళ్లు గోరు వెచ్చగా ఉండగా వడకట్టి అందులో కాస్త నిమ్మరసం, తేనెను రుచి కోసం కలిపి తాగేయాలి. ఈ నీళ్లను ఒక కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగవచ్చు. రోజూ మీరు తాగే టీ, కాఫీలకు బదులుగా ఈ నీళ్లను తాగుతుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. బిర్యానీ ఆకుల నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో పలు ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. బిర్యానీ ఆకుల్లో యూజినాల్, మైరిసీన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక బిర్యానీ ఆకుల నీళ్లను తాగుతుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్, కండరాల నొప్పులు తగ్గుతాయి.
షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు..
బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బిర్యానీ ఆకుల నీళ్లను తాగితే శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం పెరుగుతుంది. ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బిర్యానీ ఆకుల్లో లైనలూల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. రాత్రి పూట బిర్యానీ ఆకుల నీళ్లను తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
దగ్గు, జలుబు తగ్గేందుకు..
బిర్యానీ ఆకుల నీళ్లను తాగితే శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దీని వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. బిర్యానీ ఆకుల నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడు అందులో కాస్త జండూబామ్‌ను వేసి ఆవిరి పడుతుంటే సమస్య మరింత త్వరగా తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యానికి కూడా బిర్యానీ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. బీపీ సైతం తగ్గిపోతుంది. ఇలా బిర్యానీ ఆకుల నీళ్లను సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.