పహల్గాంలో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య "ఆపరేషన్ సిందూర్"
పహల్గాంలో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య "ఆపరేషన్ సిందూర్"
పర్యాటకుల మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం నిజమైన నివాళిగా భావిస్తున్నాం
ఉగ్రవాదం అంతం కావడమే అంతిమ లక్ష్యం కావాలి
కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు
అందమైన ప్రదేశాలను చూసి ఆస్వాదించేందుకు, ఆహ్లాదమైన వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే "ఆపరేషన్ సిందూర్" అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారత సాయుధ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసి గట్టి సమాధానమిచ్చాయని, తీవ్రవాదంపై భారత ఉక్కు సంకల్పానికి ఇది ఒక నిదర్శనం అని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి వందనం అని పేర్కొన్నారు. కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఉగ్రమూకల విచక్షణ రహిత కాల్పులతో పహల్గాంలో అన్యాయంగా ఎంతో మంది భారతీయ స్త్రీల నుదటన సింధూరం లేకుండా చేసిన బాధిత పర్యాటకుల ఆత్మలకు ఈ దాడితో శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ దాడి పర్యాటకులపై కాదు, భారత్ పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.. అమాయకులైన పర్యాటకులను బలిగొన్న ఘటన హృదయ విదారకమైనదని, దేశ సమగ్రతకు, ఐక్యతకు చిచ్చుపెట్టాలని చూస్తే సహించబోమని తెలిపారు. చేసిన పాపానికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు..యావత్ భారతదేశం ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించాల్సిన సమయం ఇదని... భారత సైన్యానికి అండగా నిలవాల్సిన తరుణమని పిలుపునిచ్చారు... భారతదేశ ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నంచేయలేదని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.. అందరూ ఏకతాటిపై నిలిచి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం.. ఉగ్రవాదుల దాడుల నుంచి దేశ పౌరులను రక్షించుకుందామని పిలుపునిచ్చారు... భారత్ మాతా కీ జై... జై జవాన్ అని మంత్రి దుర్గేష్ నినదించారు.