రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా కలెక్టర్ కు పురస్కారం అందజేత
రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా కలెక్టర్ కు పురస్కారం అందజేత
మచిలీపట్నం మే 8: ----
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని రాజభవన్ దర్బార్ హాలులో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సిఎస్) రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 రక్త దాన కేంద్రాలు నడుస్తున్నాయని అందులో ప్రతి సంవత్సరం 65 వేల రక్త యూనిట్లు పైగా సేకరించడం జరుగుతుందన్నారు
ఇందులో నుంచి అవసరం ఉన్న ప్రజలకు లక్షకు పైగా యూనిట్ల రక్తం ఇవ్వడం జరుగుతుందని, అందులో మూడవ వంతు యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందే పేద రోగులకు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి బంగారు పతకము, పురస్కారం అందజేసి అభినందించారు.
గత ఏడాది బుడమేరు, కృష్ణానది వరదలలో జిల్లా ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నంలో బాలాజీ చేసిన కృషికి గుర్తింపుగా రెడ్ క్రాస్ ఈ అవార్డును ప్రకటించింది. కనీస రవాణా సదుపాయాలు సైతం అందుబాటులోకి రాని విపత్కర పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి బాధితులకు బాసటగా నిలిచారు కలెక్టర్ బాలాజీ. బుడమేరు వరద, ఎదురుమొండి దీవుల వరద ముంపు బాధితులకు అండగా వరదలు పూర్తయ్యే వరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను విపత్తు నుండి కాపాడి వారికి పెద్దయెత్తున ఆహార పదార్థాలను సరఫరా చేయించారు. అలాగే జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు విస్తృతంగా అందించుటకు నిరంతరం రెడ్ క్రాస్ జిల్లా కమిటి కి దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు నడపడం విశేషం. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందుకున్న ఈ అవార్డు, జిల్లాకే గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా మానవతా సేవా కార్యక్రమాల బలోపేతానికి కృషిచేస్తున్న వారికి ఈ అవార్డు విశిష్ట గుర్తింపుగా నిలుస్తుంది..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్, గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్లాల్, ఐ ఆర్ సి ఎస్ చైర్మన్ వై డి రామారావు, రెడ్ క్రాస్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ సీఈవో, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీదా, రాజభవన్ సిబ్బంది పాల్గొన్నారు.