ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ
పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని తెలిపిన మంత్రి దుర్గేష్
తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా
గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ
తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: పహల్గాం ఉగ్రమూకల దారుణకాండలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికులు మురళీ నాయక్ ల ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీరజవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మౌనం పాటించి ఘన నివాళి తెలిపారు. వీర మరణం పొందిన మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదు అన్నారు. నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు మాజీ సైనిక అధికారుల కృషిని వేదికపై ప్రస్తావించారు. నేడు తామంతా శాంతియుతంగా జీవితం కొనసాగిస్తున్నామంటే, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నామంటే అందుకు కారణం సైనికులు, సైనికాధికారుల చొరవవల్లేనని తెలిపారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా చేసిన తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత జాతి మీద కన్నెత్తితే తగిన గుణపాఠం చెప్పేందుకు భారత పౌరులుగా తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సువిశాల భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని అన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదటన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నెలబెట్టారని తెలిపారు. శాంతి కాముక దేశమైన భారత్ లో భారతీయులు కోరుకునేది శాంతి అన్నారు.తీవ్రవాదులు భారత్ పై దండెత్తితే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాన మోదీకి, ఆయనకు సహకరించిన జవాన్ లకు సెల్యూట్ అని చెప్పారు. ఈ సందర్భంగా జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకీ జై అని నినదించారు.
కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కూటమినాయకులు, స్వచ్ఛంధ సంస్థల సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.