మనమిత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మనమిత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అన్ని సేవలూ ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్‌లో అందించాలి
ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం కావాలి
గ్రమాల్లో పారిశుధ్యం మరింత మెరుగుపడాలి
అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు
అమరావతి: మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి, ప్రభుత్వ సేవలన్నీ వారు మనమిత్రలో పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన సోమవారం ఆర్టీజీఎస్ కార్యకలాపాలపైన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 12వ తేదీలోపు మనమిత్ర ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు ఇచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగనవసం లేకుండా అన్ని సేవలు మనమిత్ర ద్వారా పొందేలా చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఆ దిశగా మనమిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ కూడా లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. డేటా అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని ఆయా శాఖలకు అందించడానికి వీలవుతుందన్నారు. పంచాయతీరాజ్ విభాగాధికారులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, చెత్తతొలగింపు పనుల్లో కొంత పురోగతి కనించిందని, అయితే పారిశుద్ధ్య మరింత మెరుగుపడాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఆర్టీసీ సేవల్లో కూడా మరింత ప్రగతి సాధించాలని సూచించారు. డ్రోన్ మార్ట్ వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చేతులమీదు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోర్టల్‌ను రూపొందించాలని సూచించారు.
ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 325 సేవలను ప్రజలకు అందిస్తున్నామని, ఈ నెలాఖరుకు 400 సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆశయంప్రకారం జూన్ 12వ తేదీకల్లా 500 సేవలు అందిస్తామన్నారు. వాట్సాప్ ద్వారా ప్రజలు డౌన్ లోడు చేసుకునే ధృవపత్రాల తనిఖీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని సమర్థంగా ఉపయోగిస్తున్నామన్నారు. ఏపీసేవలో 14,269 ధృవీకరణ పత్రాలకు, మీ సేవలో 1240 ధృవీకరణ పత్రాలకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పాత సర్టిఫికెట్లను కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ధృవీకరించడం జరుగుతుందన్నారు. డేటా లేక్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణ తేజ్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.