సీపీ బ్రౌన్ లైబ్రరీ సేవలు అభినందనీయం
సీపీ బ్రౌన్ లైబ్రరీ సేవలు అభినందనీయం
సి.పి.బ్రౌన్ గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేసిన మంత్రి సవిత
కడప, మే 19 :
భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ దిశగా సిపి బ్రౌన్ గ్రంథాలయం విశేష కృషి చేస్తోందని.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు.
రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కడప లోని.. యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం అదనపు నూతన భవన నిర్మాణానికి జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్. సవిత భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జేసీ అదితిసింగ్, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. పద్మ, తదితరులు హాజరయ్యారు.
అనంతరం గ్రంథాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ... తెలుగు బాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. తెలుగు బాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం ద్వారా.. తెలుగు భాష కీర్తి పతాకాలు ప్రపంచ దేశాల్లో సైతం రెపరేపలాడుతున్నాయన్నారు.
కడప అంటే ఇతర ప్రాంత ప్రజలకు చిన్నచూపు ఉందని, కానీ బ్రౌన్ గ్రంథాలయం లాంటి విజ్ఞానసౌధం ఆ అపనిందను రూపుమాపేలా వెలసిందన్నారు. గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను, ఇతర వ్రాతప్రతులను ప్రత్యేకంగా చూపిస్తూ డాక్యుమెంటరీ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
చిత్రకూటం అమృతవల్లి, కీ.శే. సంపత్ కుమార్ గార్ల సౌజన్యంతో ఇచ్చిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణ పనులకు నోచుకోలేక పోయిన గాంధాలయ భవన నిర్మాణ పనులకు ఈ ప్రభుత్వంలో మోక్షం వచ్చిందన్నారు. ఈ భవన నిర్మాణం కోసం జనుమద్ది విజయ భాస్కర్ చేసిన కృషి అభినందనీయం అన్నారు.
తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదే అన్నారు. 1995లో ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు బ్రౌన్ గ్రంథాలయాన్ని అధికారికంగా ప్రారంభించారని, ఇప్పుడు నిర్మించబోయే నూతన భవనాన్ని కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభింపజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపించేలా చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కడప జిల్లా పారిశ్రామికంగా, సహజ వనరుల పరంగా ఎలాంటి కొరత లేకుండా పుష్కలంగా ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ... పి-4 విధానం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తాం అన్నారు.
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. తెలుగు భాషా ప్రియులకు సిపి బ్రౌన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలుగు భాష సాహిత్యాన్ని.. పునర్లిఖించిన ఆంగ్లేయ సాహితీ శిఖరం.. "చార్లెస్ ఫిలిప్ బ్రౌన్" అని ఆయన సేవలు తెలుగు భాషా సాహితీవేత్తలకు ఆదర్శనీయం అన్నారు. సి.పి.బ్రౌన్ ఈస్ట్ ఇండియా ఉద్యోగిగా మన దేశానికి వచ్చి తెలుగు నేర్చుకోవడమే కాకుండా.. తెలుగు భాషను ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా పారిమళింపజేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. తెలుగు భాషా అభిమానిగా తాళపత్ర గ్రంథాలను సేకరించి.. తెలుగు వారికి వేమన విజ్ఞాన సారాంశాన్ని పంచిన ఘనత సి.పి. బ్రౌన్ కే దక్కుతుందన్నారు. సి.పి బ్రౌన్ సేకరించిన గ్రంధాలను భద్రపరచడంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి తన శేష జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ లైబ్రరీనెక్ అభివృద్ధి లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ.. యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న.. సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం విస్తరణాభివృద్ధికి, యూనివర్సిటీ భాషా పరిశోధక యంత్రాంగం చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. అనంతరం.. ఆదరణ, ఔన్నత్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్న తెలుగు భాష సాహిత్యాన్ని.. పునర్లిఖించిన ఆంగ్లేయ సాహితీ శిఖరం.. "చార్లెస్ ఫిలిప్ బ్రౌన్" అని ఆయన సేవలు తెలుగు భాషా సాహితీవేత్తలకు ఆదర్శనీయం అన్నారు. ఇలాంటి గొప్ప గ్రంథాలయం మన జిల్లా కేంద్రంలో ఉండడం మన జిల్లాకే గర్వకారణం అన్నారు. జిల్లా లోని విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయ పుస్తక నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ... ఎందరో మహానుభావులు సిపి బ్రౌన్ గ్రంథాలయం స్థాపనకు కృషి చేశారని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధిలో ఎంతో కృషి చేసిన జానుమద్ది హనుమచ్ఛాస్త్రిని సేవలు మరువలేమని.. తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్న ఆయన కుమారుడు విజయ్ భాస్కర్ ను అభినందించారు.
వైవియు విసి అల్లం శ్రీనివాస రావు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిందని, తెలుగు భాషా సాహిత్యాలకు ప్రధాన కేంద్రంగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. నూతన భవనాన్ని అత్యాధునిక సదుపాయాలతో పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
కార్యక్రమంలో ముందుగా యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న.. సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రంలో.. జానుమద్ది సాహితీపీఠం వారి సౌజన్యంతో ప్రతిష్టించిన తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముపార్జకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం.. సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను ఒక్కొక్కటిగా తిలకించారు. అంతేకాకుండా.. గ్రంధాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను ఆమె పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కే ఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డా. జి. పార్వతి, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు.