డిజిటల్ విధానంలో స్త్రీ నిధి రుణాల చెల్లింపులకు శ్రీకారం
డిజిటల్ విధానంలో స్త్రీ నిధి రుణాల చెల్లింపులకు శ్రీకారం
స్త్రీ నిధి యాప్ ను ప్రారంభించిన మంత్ర్రి కొండపల్లి శ్రీనివాస్
పేదరిక నిర్ములనలో భాగంగా పేదల జీవనోపాధి అభివృద్ధికి అవసరమైన రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న స్త్రీనిధి- ఆంధ్రప్రదేశ్, డిజిటల్ విధానం ద్వారా లబ్ధిదారులు రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, బ్యాంకుల మరియు ఇతర ఆర్థిక సంస్థలతో సహకరించి పేద మహిళలకు అవసరమైన రుణాలను మొబైల్ టెక్నాలజీ మరియు బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా 48 గంటలలోపు అందించేందుకు స్త్రీ నిధి చర్యలు చేపట్టింది. ఈ రుణాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శత కొరకు మరియు చెల్లింపుల భద్రతా కోణంలో లబ్ధిదారులు పురోగతిని సాధించడం కోసం స్త్రీనిధి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా "Sthree Nidhi" పేరుతో ఒక డిజిటల్ యాప్ ను రూపొందించినట్లు స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ . హరిప్రసాద్ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) మంత్రి, కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వీర్యం అయిన సెర్ప్ విభాగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. నిరక్షరాస్యత వలన గ్రామాల్లో మహిళలు తాము పొందిన రుణాలను తిరిగి సాంప్రదాయ పద్దతిలో చెల్లింపులు జరపడం వలన చాలా రోజుల సమయం వృధా అవడంతో పాటు, ఆర్థిక లావాదేవీలపై అవగాహనా లోపం మరియు తాము ఎంత రుణాలను తిరిగి చెల్లించాము వంటి అంశాలపై స్పష్టత లేకపోవడం కారణంగా వారు మోసానికి గురికావచ్చు తద్వారా వారిపై మరింత ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని మరింత వేగవంతం చేయడం కోసం మరియు వారిని మైక్రో ఫైనాన్స్ భారిన పడకుండా కాపాడటం కోసం స్త్రీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేయడం హర్షనీయంశం అని అన్నారు. డిజిటల్ విధానం లో స్త్రీ నిధి యాప్ ద్వారా చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా లబ్దిదారులకు మేలు చేకూరుతుందన్నారు. అంతేకాకుండా SHG సభ్యులు నేరుగా ఈ యాప్ ను వాడేందుకు వారికీ పూర్తి అవగాహన కల్పించే దిశగా స్త్రీనిధి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా యాప్ ను అమలులోకి తీసుకురావడానికి CSR ఫండ్స్ ద్వారా సహకరంచిన బ్యాంకింగ్ భాగస్వాములను అభినందించారు. లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఎలాంటి పొరపచ్చాలు జరగకుండా బ్యాంకు వారు జాగ్రత్త వహించాలని కోరారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంస్థ, బ్యాంకు అధికారులు మరియు SHG సభ్యుల మధ్యన "Sthree Nidhi" యాప్ ను ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ స్ర్తీనిది యాప్ ను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఒక స్వయం సహాయక సభ్యురాలు మంత్రిగారి ఆధ్వర్యంలో యాప్ ద్వారా ప్రత్యక్షంగా యాప్ డౌన్లోడ్, లాగిన్ ప్రక్రియ, చెల్లింపు లావాదేవీ చేసి చూపించడం జరిగింది. డిజిటల్ విధానంలో రీపేమెంట్ యాప్ తీస్కురావడాన్ని స్వాగతిస్తూ స్త్రీనిది సిబ్బందిని అభినందించారు.
కార్యక్రమం లో భాగంగా యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు మాట్లాడుతూ డిజిటల్ పేమెంట్ యాప్ లో యూనియన్ బ్యాంకు ను భాగస్వామిగా చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సెర్ప్ మరియు స్త్రీనిధి సంస్థలలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మకమైన సాంకేతిక మార్పుతో గ్రామీణ మహిళలకు జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టవచ్చు అని తెలిపారు.
అనంతరం సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ ఐఏఎస్ మాట్లాడుతూ స్త్రీనిధి, సెర్ప్ సంస్థలో అంతర్భాగమని, గ్రామీణ మరియు పట్టణాలలో ఉన్న పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి స్త్రీనిధి దోహదం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్త్రీనిధి, సెర్ప్ విభాగాలకు చెందిన అధికారులు, బ్యాంకు అధికారులు మరియు స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.