20 సూత్రాల కార్యక్రమం అమలు లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు అవసరం
20 సూత్రాల కార్యక్రమం అమలు లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు అవసరం
20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్
అమరావతి, మే 22: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలు, పథకాలు, లక్ష్యాలకు అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమం అమలులో నిర్మాణాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి తాను వ్రాసిన లేఖకు ప్రధాన మంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో పాత్రికేయులతో మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమం అమల్లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలులో 2006 లో నాటి అవసరాలకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకూ అంటే గత 19 సంవత్సరాల నుండి 2006 నాటి విధానంలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి మాస, త్రైమాసిక, అర్ధ సంవత్సర మరియు సంవత్సర నివేదికలు పంపడం జరుగుచున్నదన్నారు.
అయితే, 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దే సంకల్పంతో వికసిత్ భారత్@2047 కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం జరుగుతుంటే, 2047 నాటి 15 శాతం వృద్ది రేటుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంద్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. సంస్కర్ణలతోనే దేశ, రాష్ట్ర సమ్మిళిత అభివృద్ది సాధ్యం అని డబుల్ ఇంజన్ సర్కార్ సంస్కర్ణల బాటలో ముందుకు వెళుతూ దేశంలో వికసిత్ భారత్, రాష్ట్రంలో స్వర్ణాంద్రప్రదేశ్ సాధన లక్ష్యంగా పలు వినూత్న పథకాలను రూపొందించి అమలు పర్చడం జరుగుచున్నదన్నారు.
2014 అనంతరం నీతి ఆయోగ్ సూచించిన 17 దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ పథకాలను, ప్రాజెక్టులను దేశ ప్రధాని నరేంద్ర మోడీ రూపకల్పన చేసి అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. నీతి ఆయోగ్ సూచించిన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు ఆధునీకరించి వివిధ నూతన కేంద్ర పథకాలు మరియు ప్రాజెక్టుల ద్వారా “ వికసిత్ భారత్@2047 “ సంకల్పాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారన్నారు. అదే తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికై స్వర్ణాంధ్ర@2047 సాధనలో భాగంగా 15% వృద్ది రేటు సాధనకై పలు వినూత్న ప్రణాళికలను రూపొందించి అమలు పర్చడం జరుగుచున్నదన్నారు.
అదే విధంగా 20 సూత్రాల కార్యక్రమం అమలుపై ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 11 జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా కార్యక్రమంలో తాను స్వయంగా పరిశీలించిన అంశాల మేరకు 20 సూత్రాల కార్యక్రమాల అమలులో తక్షణమే సంస్కరణలు అవసరమనే విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ నుండి వివిధ సందర్భాలలో రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలును “ స్వర్ణాంధ్ర సాధన సూత్రాలు” గా, దేశంలో “ పీఎం వికసిత్ భారత్ సాధన సూత్రాలు లేదా పీఎం వికసిత్ భారత్ కార్యక్రమాల అమలు“ గా మార్చాలని కోరుతూ సంబందిత సమాచారంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖలు వ్రాయడం జరిగిందన్నారు. అదే విధంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 3 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి వ్రాసిన లేఖ వ్రాయడం జరిగిందన్నారు. మేము వ్రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ తదననుగుణంగా చర్యలకు ఉపక్రమించమని “ కేంద్ర గణాంక మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలు మరియు మౌలిక సదుపాయాల పర్యవేక్షణ శాఖ “ కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ లేఖకు సానుకూలంగా స్పందించారన్నారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మెన్ గా ఇప్పటివరకు 24 జిల్లాలలో కలెక్టర్లు మరియు అధికారులతో వివిధ కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరు పైన సమీక్ష చేయడం జరిగిందని, మిగిలిన రెండు జిల్లాలో కూడా ఈ నెలాఖరులోపు సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.