నగర ప్రజలకు నీటి సమస్యను రానీయం ..
నగర ప్రజలకు నీటి సమస్యను రానీయం ..
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: మే 06, 2025
నగర ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం ఆయన నగర పరిధిలోని మాచవరం రెండవ డివిజన్లో దాదాపు రూ.2.68 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 500 కిలో లీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయరును జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా దాదాపు ఐదు లక్షల లీటర్లను నిల్వ చేసి నగర ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ రిజర్వాయరును నిర్మించడానికి 2014లో అమృత్ పథకం కింద కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి పనులు చేపట్టినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో మాచవరంతో పాటు గిలకలదిండిలోని రెండు ట్యాంకులు నిరుపయోగంగా ఉండిపోయాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులను పూర్తి చేసి నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 14 ప్రాంతాలలో రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకున్నామని, భవిష్యత్తులో అవసరం మేరకు మరిన్ని రిజర్వాయర్ లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో కూడా 200 ఎకరాలలో తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను అప్పటి టిడిపి ప్రభుత్వ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలోనే ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. తర్వాత 2014–19 టిడిపి ప్రభుత్వ హయాంలో తరకటూరు పైపులైన్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టామన్నారు.
అదేవిధంగా నీటిని శుద్ధి చేయడానికి రూ.16 కోట్ల వ్యయంతో నగరంలో ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇటీవల దాదాపు వెయ్యి హార్స్ పవర్ సామర్థ్యం గల మోటార్లను పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నింపామని, దీనివల్ల బందరు పట్టణంతోపాటు బందరు మండలం, పెడనకు రాబోయే రెండు నెలలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరిపోయినంత నీటి లభ్యత ఉందని మంత్రి తెలిపారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంత్రి ముందుచూపుతో రాబోయే 70 రోజులకు బందరు నియోజకవర్గ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపారని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందనడంలో ఇదే నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, కూటమి నాయకులు మాదివాడ రాము తదితర నాయకులు పాల్గొన్నారు.