కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జనాన్లకు ఎప్పుడూ అండగా నిలబడుతాం
కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జనాన్లకు ఎప్పుడూ అండగా నిలబడుతాం
దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జనాన్లకు ఎప్పుడూ అండగా నిలబడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలి కశ్మీర్ ఘటనల నేపథ్యంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించి వారికి శాశ్వత గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామని చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకుని డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ముందు ఆ మహనేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రోజున “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమని అన్నారు. కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని, కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించామని గుర్తుచేశారు. గతంలో యుద్ధం జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పారని, ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆ యుద్దం సందర్భంగా ఆనాడు అమెరికా, లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఇందిరా గాంధీ గారు అంగీకరించలేదని గుర్తుచేశారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కరలేదని స్పష్టంగా చెప్పారని అన్నారు. కశ్మీర్ ఘటనలపై పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లిఖార్జున ఖర్గే గారితో పాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామని, ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.
దేశ సమగ్రతను కాపాడటంలో మహాత్మాగాంధీ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు, పీవీ నరసింహారావు గారి విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21 వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు.
రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ మేయర్ పాల్గొన్నారు.