ఆయుష్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
ఆయుష్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
కూటమి ప్రభుత్వమొచ్చాక ఆయుష్‌ను బలోపేతం చేశాం
రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ
దేశీయ,అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆక్షించేందుకు ఏపీలో సదస్సు నిర్వహిస్తాం
ఆయుష్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు
ఏపీలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లో హెల్త్ వెల్నెన్ సెంటర్లను విస్తరిస్తాం
చెన్నైలో జరిగిన దక్షిణాది మంత్రులు, అధికారుల ఆయుష్ సదస్సులో మంత్రి సత్యకుమార్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఆయుష్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయుష్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటు వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పర్యాటక విధానానికి రూపకల్పన చేసిందని ఆయన చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖతో నిరంతరం కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సోమవారం చెన్నయ్ లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, అధికారుల రెండవ ఆయుష్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్ ఆధారిత ఆరోగ్య పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా గతేడాది సెప్టెంబరులో ముంబయిలో మొదటి సదస్సును నిర్వహించింది.
సోమవారం నాడు చెన్నైయ్ లో జరిగిన రెండవ సదస్సులో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో మహానంది, బెలుం గుహల వంటి పర్యాటక కేంద్రాలతో పాటు సుదీర్ఘమైన సముద్ర తీరం కూడా ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సముద్ర తీరం వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి 960 కిలో మీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందన్నారు. దీంతో పాటు అత్యంత సుందరమైన బీచ్ లు కూడా ఏపీలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించిందన్నారు. ఈ కొత్త విధానంలో ఆయుష్ వెల్నెస్ వంటి అంశాలను సమ్మిళితం చేశామన్నారు. రాష్ట్రంలో పర్యాటకులను యాత్రా స్థలాలకన్నా మిన్నగా పర్యాటక కేంద్రాలు ఆకర్షిస్తున్నాయన్నారు. రాష్ట్ర పర్యటనకొచ్చే వారిలో దేశీయ పర్యాటకులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో యాత్రా స్థలాలతో పాటు పర్యాటక కేంద్రాలను కూడా విస్తరించి అక్కడ పర్యాటకుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ఆయుష్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి చెప్పారు.
అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఖతార్ ప్రభుత్వంతో కలిసి
గ్లోబల్ మెడిసిటీని పీపీపీ విధానంలో నెలకొల్పనున్నామన్నారు. ఇందులో ఆధునిక వైద్యం, ఆయుష్ సౌకర్యాల్ని అందిస్తూ మాల్ వంటి రిక్రియేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం 200 నుండి 400 ఎకరాల స్థలాన్ని రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించారన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆయుష్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మంత్రిగా తాను రూ. 83 కోట్ల మేర నిధుల్ని కేంద్రం నుంచి పాత స్టేట్ యానువల్ ప్లాన్ కింద ఏపీకి తీసుకొచ్చానన్నారు. గత ఐదేళ్లలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేవలం రూ.38 కోట్లు మాత్రమే నిధుల్ని తీసుకొచ్చారన్నారు. కొత్త స్టేట్ యానువల్ ప్లాన్ కింద రూ.150 కోట్లు కావాలని గత నెలలో ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రతిపాదించగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. స్టేట్ యాన్యువల్ ప్లాన్ కింద ఆయుర్వేద ఆసుపత్రుల్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుందన్నారు. ఏపీలో 58 హెల్త్ వెల్నెస్ సెంటర్లున్నాయన్నారు. రాష్ట్రంలోని 128 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లలో 89 మందిర్ లు ఎన్‌బిహెచ్ అక్రిడేషన్ పొందాయని, మిగతా వాటికి కూడా ఎన్ఎబిహెచ్ అక్రిటేషన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో యోగా ట్యూటర్లు ఉన్నారన్నారు.
ప్రతి ఆరోగ్య మందిరంలోనూ ఆయుష్ విధానంలో వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో వుంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరోగ్య విలువలు మరియు వెల్నెస్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆయుష్, టూరిజం మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టడమే కాకుండా, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాల్ని చేపట్టాయన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిస్ట్ ప్రదేశాల్లో హెల్త్ వెల్నెన్ సెంటర్లను విస్తరించనున్నామని, గుర్తింపు పొందిన ఆసుపత్రుల వివరాలతో పాటు ఆయుష్ సౌకర్యాల్ని తెలుసుకునేందుకు గాను పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్, దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.