తనువు మనసును ఏకం చేసి..సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసి..
తనువు మనసును ఏకం చేసి..సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసి..
యోగాచరణతో దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ సొంతం
- ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ యోగాను చేరువచేసేందుకే యోగాంధ్ర
- 26 జిల్లాల్లో, 26 రోజులపాటు 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా కార్యక్రమాలు
- రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రచార కార్యక్రమాలు
- కనీసం రెండు కోట్లమందికి యోగాను చేరువచేసేందుకు కృషి
- ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు
- కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్ జి.వీరపాండ్యన్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గిరీష పీఎస్, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్
- కార్యక్రమంలో భాగస్వాములైన అమరావతి యోగా అసోసియేషన్, పతంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీలు
శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి.. సుసంపన్న ఆరోగ్యాన్ని బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువచేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
సోమవారం విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జి.వీరపాండ్యన్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గిరీష పీఎస్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు, నగర ప్రజలు పాల్గొని డా. రత్న ప్రియదర్శిని మార్గనిర్దేశనంతో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మే 21న ప్రారంభమైన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులపాటు 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు వివరించారు. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు.. ఇలా సమాజంలోని ప్రతివర్గానికి యోగాను చేరువచేసేందుకే ఈ థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి, అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రతిజిల్లాలో నాలుగైదు చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం కల్పించాలనే యోగాంధ్రను నిర్వహిస్తున్నామని, గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని.. రాష్ట్రస్థాయి విజేతలు జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో గౌరవ ప్రధానితో ఇంటరాక్ట్ కానున్నారని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు.
ప్రత్యేక ట్రైనర్లతో జిల్లాలో కార్యక్రమాలు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయానికి ఏడుగురు చొప్పున దాదాపు దాదాపు అయిదువేల మంది ట్రైనర్లతో ప్రజలకు యోగాసనాలు నేర్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. యోగా ప్రయోజనాలపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు తమ జీవనశైలిలో యోగాను భాగం చేసుకొని జీవితాంతం అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. విజయవాడలో బీఆర్‌టీఎస్ రోడ్డును యోగా స్ట్రీట్‌గా గుర్తించి, ప్రతిరోజూ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణాయామ ప్రదర్శన, మెడిటేషన్, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, రోల్‌ప్లే, యోగా క్విజ్, యోగా పోస్టర్, స్లోగన్ తదితరాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి: ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు
ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. యోగాభ్యసనతో శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతో పాటు అభ్యసన చేయించడం జరుగుతోందన్నారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల నిడివితో ఉన్న కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగాసనాలు నేర్పిస్తున్నామన్నారు. యోగాను ప్రతి వర్గానికి చేరువచేయడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని.. అందరం కలిసి యోగాంధ్రను విజయవంతం చేద్దామని దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్టిస్టిక్ యోగాలో శిక్షణ ఇస్తూ, యోగాకు గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్న ట్రైనర్ బి.శిరీష విద్యార్థుల కళాత్మక యోగా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డా. వి.రాణి, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డా. రామత్లేహి,
మెడికల్ ఆఫీసర్ డా. వై.రత్న ప్రియదర్శిని, యోగాంధ్ర నోడల్ అధికారులు డా. ఎం.సుహాసిని, డా. జె.సుమన్, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. రమేష్ కొల్లేటి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి యోగా అసోసియేషన్, పతంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీలు భాగస్వాములయ్యారు.