రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తెలంగాణలో జోరుగా వానలు .. అన్నిజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ..!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

తెలంగాణలో జోరుగా వానలు .. అన్నిజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ..!!


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు

మరో ఐదు రోజులూ కురుస్తాయన్న వాతావరణ శాఖ

బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక

హైదరాబాద్, రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు.. బుధవారం ఉదయానికి రాష్ట్రమంతటా వ్యాపించాయి. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అదే జిల్లా మంగళవారిపేటలో 7.7, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 7.7, మహబూబాబాద్జిల్లా కొత్తగూడలో 7.4, వరంగల్జిల్లా చెన్నారావుపేటలో 6.7, సూర్యాపేట జిల్లా బలరాం తండాలో 6.7, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 6.6, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లిలో 6.3, నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 6, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్, మెదక్ జిల్లా మాసాయిపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోనూ పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. బీహెచ్ఈఎల్‌లో 3.5 సెంటీమీటర్లు, పటాన్‌చెరులో 3, గచ్చిబౌలిలో 2.5, లింగంపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉప్పల్, సైదాబాద్, హిమాయత్‌నగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, రాజేంద్రనగర్, ముషీరాబాద్, కూకట్‌పల్లి, షేక్‌పేట, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

చురుగ్గా రుతుపవనాలు..

నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్అయ్యేలా వాతావరణం మారుతున్నది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతున్నది. అది కూడా 36 గంటల్లో వాయుగుండంగా మరింత బలపడనుంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళలోకి మరో మూడు రోజుల్లోనే రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలంగా వాతావరణం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమొరిన్, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడుతుండడంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే వచ్చే మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఇటు కేరళతో పాటు తమిళనాడులోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. దాని ప్రభావంతోనే దక్షిణాదిన జోరుగా వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది.

తగ్గిన ఉష్ణోగ్రతలు

ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోనూ ఈదురుగాలుల తాకిడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాగా, మంగళవారం ఒక్క నల్గొండ జిల్లా తప్ప.. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి.

నల్గొండ జిల్లా పడమటిపల్లిలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 7 జిల్లాల్లో 40 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 41, ఆదిలాబాద్‌లో 40.7, మంచిర్యాలలో 40.5, జగిత్యాలలో 40.4, కరీంనగర్‌లో 40.2, జయశంకర్భూపాలపల్లిలో 40.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అత్యల్పంగా మెదక్జిల్లాలో 36.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది.

Comments

-Advertisement-