ఈ -కామర్స్ నకిలీ యాప్‌లతో మోసాలు - ముంబయి మహిళ ఆధ్వర్యంలో కాల్‌సెంటర్ల నిర్వహణ
ఈ -కామర్స్ నకిలీ యాప్‌లతో మోసాలు - ముంబయి మహిళ ఆధ్వర్యంలో కాల్‌సెంటర్ల నిర్వహణ
రోజుకో కొత్త ఎత్తు - అచ్యుతాపురం అడ్డాగా అమెరికన్లకు టోపీ
సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. ఓవైపు బహుమతులు, ఉద్యోగాలు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. నకిలీ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్నారు. ఇందుకోసం రూటు టెలీకాలర్స్‌ను నియమించుకుంటున్నారు. ఇలా కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో అమెరికా పౌరులను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
అచ్యుతాపురం కేంద్రంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. కాల్‌సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్‌లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముంబయికి చెందిన ఓ మహిళ అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా రెండు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం అమెరికా ఈ-కామర్స్ పేరుతో అక్కడి పౌరులకు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. మీ పేరిట పార్సిల్ వచ్చిందని దాన్ని అందజేయాలంటే కొంత డబ్బు చెల్లించాలంటూ అడుగుతున్నారు. పార్సిల్ వద్దనుకుంటే వివిధ కంపెనీల పేరిట ఆఫర్లు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా కూపన్లు కూడా కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. చివరికి డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ వారి శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి 200 డాలర్ల నుంచి 3000ల డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు